home page

జనం గుండెల్లో గులాబీ జెండా

 | 
Car
జనం గుండెల్లో గులాబీ జెండా
‘గురివింద గింజ తనకింది నలుపెరుగదన్నట్టు’గా ఉంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు. 
తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం,ఏర్పడి ఎనిమిదేండ్లే అవుతున్నది. అయినా ఇక్కడేమో అభివృద్ధి జరుగుతలేదన్నట్లు, ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్లు బీజేపీ నాయకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. 
దేశం మొత్తం దోచుకున్నది చాలదన్నట్లు, ఇక తెలంగాణ మీద పడదామని ముఠా అంతాఒక్క గాటన చేరుకున్నది. బీజేపీ అబద్ధాల, మోసపూరిత మాటలతో మిగతా రాష్ర్టాలను మోసగించినట్లు తెలంగాణను చేద్దామని చూస్తే వాళ్ల ఆటలు ఇక్కడ సాగవు. తెలంగాణ ప్రజలు మేధావులు. ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని అధఃపాతాళానికి తొక్కాలో తెలిసినవాళ్లు.
భారత సమాజం సర్వమత సమ్మేళనం. ఈ దేశంలో అన్ని మతాల ప్రజలు జీవిస్తుంటారు. అలాంటి దేశంలో భిన్నమతాల, ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నది భారతీయ జనతా పార్టీ. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రాంతం రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నది. ఇది ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ఏదోరకంగా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతో ఆదినుంచే వివక్షాధోరణిని ప్రదర్శిస్తున్నది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నిరంగాల్లో నెం-1 స్థాయిలో తెలంగాణను నిలబెట్టారు. పాలన చేతకాదు అన్నవాళ్ల నోటితోనే తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా సాగుతుందనిపిస్తున్నారు కేసీఆర్‌. ఇప్పుడు యావత్‌ దేశం తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నది. యావత్భారతం కేసీఆర్‌ వంటి నాయకుడి కోసం అన్వేషిస్తున్నది.
సకల సదుపాయాలు, వెలకట్టలేని వనరులు మన దేశ సొంతం. సమర్థవంతమైన నాయకులున్నప్పుడే కదా వాటిని సక్రమంగా వినియోగించుకునేది. ఆ వనరులను వాడుకోవడంలో గత డబ్బు ఐదేండ్లుగా దేశ పాలకులు విఫలమవుతున్నారు. వారికి కొనసాగింపుగా వచ్చిన నాయకుడే ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన దేశాభివృద్ధి చేపట్టకుండా తన అనుయాయులకు, కార్పొరేట్లకు దేశ వనరులను ధారాదత్తం చేస్తున్నారు. యావత్‌ ప్రపంచంలో భారతదేశం అంటే గౌరవం ఉన్నది. కానీ మోదీ హయాంలో ఆ పరువు కాస్తా గంగల కలిసింది. దానికి తాజా ఉదాహరణే మొన్నటి శ్రీలంక ఉదంతం. ఏ దేశ ప్రధాని ప్రసంగంలోనైనా ఆ దేశం ఏ మేరకు అభివృద్ధి చెందింది, విదేశాలతో ఆ దేశానికి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎగుమతులు, దిగుమతుల అంశాలుంటాయి. కానీ మన ప్రధాని నరేంద్ర మోదీజీ తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపయ్యాయని చెప్పడం విడ్డూరం కాక మరేమిటి?
రాష్ర్టానికి ఆయన రావడం ఇది తొమ్మిదవ సారి. ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప రాష్ర్టానికి ఇచ్చిందేమైనా ఉందా? అని ఒకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. అవలోకనం చేసుకోవాలి. అదికాకుండా నువ్వా నేనా అన్నట్లు ప్రధాని మోదీ దర్శనం కోసం పోటీపడటం చూసి రాష్ట్ర ప్రజానీకం నవ్వుతున్నది. అయినా ఒక్క నాయకుడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ముఖ్యమంత్రులా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఎనిమిదేండ్లలో చేసిందేమంటే ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడం, ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి తమ ప్రభుత్వాలను ఏర్పర్చుకోవడం, మతచిచ్చులు రేపడం. ఇంతకుమించి చేసిందేమైనా ఉంటే బీజేపీ నాయకత్వం చెప్పాలి. ఒక్కటి కాదు, రెండు కాదు, వంద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పరిచినా తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడెవ్వరంటే అది ఒక్క కేసీఆర్‌ మాత్రమే. ప్రజలకు నీడనిచ్చే జెండా ఏదంటే ఒక్క గులాబీ జెండానే…