home page

కెసిఆర్ ను దించడానికి బండి చాలు : అమిత్ షా

తుక్కుగూడలో బిజెపి సభ

 | 
Amit shah

ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ ముగింపు

తెలంగాణ నయా నిజాం కేసిఆర్ ను గద్దె దించడానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కడే చాలు అని కేంద్రం హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు.

ప్రజా సంగ్రామ యాత్ర.. ఎవరినో ముఖ్యమంత్రి గద్దె దించడానికో.. ఎవరినో గద్దె దించడానికో కాదు.. బడుగు, బలహీన వర్గాల సహా అందరి సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అని అమిత్‌ షా స్పష్టం చేశారు. అన్నింటికి మించి రజాకార్ల ప్రతినిధులతో చేసిన వారికి వ్యతిరేకంగానే ఈ యాత్ర.. అవినీతి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు ఈ యాత్ర అని చాటి చెప్పారు. పటేల్‌ కారణంగానే ఈరోజు ఈరాష్ట్రం భారత్‌లో భాగమైందని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ ఒక్క మహనీయుడికి పేరు పేరునా శ్రద్ధాంజలి ఘటించారు అమిత్‌ షా. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఏ హామీని టీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేకపోయిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అది పూర్తి అవుతుందని అమిత్‌ షా స్పష్టం చేశారు.

దళితులతో పాటు అన్ని వర్గాల వాళ్లను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లులు, రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా ఉందని, హైదరాబాద్‌ నిజాంని మార్చాల్సిన అవసరం ఉందా? లేదా? అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మరోసారి గట్టిగా ప్రశ్నించారు. సర్పంచ్‌కు కూడా అధికారం ఇవ్వకుండా.. కొడుకు, బిడ్డకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్‌పై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని పక్కనపెట్టారు. మజ్లిస్‌కు మీరు భయపడతారేమో.. మేం భయపడం అని టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మన ఊరు-మన బడి నిధులు కేంద్రానివే. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారు.

ఆయుష్మాన్‌భవ లాంటి వాటిని తెలంగాణలో నడిపించడం లేదన్నారు అమిత్‌ షా. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించకండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిత్‌ షా. అధికారమిస్తే ప్రతీ గింజను కొంటామని, సంక్షేమ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే నిధులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయని అమిత్‌ షా పేర్కొన్నారు. అవకాశం ఇస్తే.. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? అని నిలదీశారు అమిత్‌ షా. సచివాలయానికి వెళ్లలేని కేసీఆర్‌ను ప‍్రజలే గద్దెదించుతారని షా పేర్కొన్నారు.