భాగ్యనగరంలో ప్రధాని మోడీ
స్వాగతం పలికిన తమిళసై, తలసాని
*బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెచ్ఐసీసీకి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరిన నరేంద్ర మోదీ..*
*భాగ్య నగరి హైదరాబాద్ శనివారం రెండు కీలక కార్యక్రమాలకు వేదిక అయిన సంగతి తెలిసిందే..*
నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటిది కాగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ జల విహార్‌లో నిర్వహించిన సదస్సు రెండోది. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు జరుగుతుండటంతో హైదరాబాద్‌లో సందడితో పాటు రాజకీయ వేడి కూడా రాజుకుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో కలిసి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్టర్‌లో మోదీ బయలుదేరే దాకా తలసాని అక్కడే ఉండిపోయారు.
మోదీకి స్వాగతం పలికే సందర్భంగా గవర్నర్, పలువురు బీజేపీ నేతలు వరుసగా నిలుచుండగా... టీఆర్ఎస్‌కు చెందిన తలసాని ఒక్కరు మాత్రమే వేరేగా కనిపించారు. ఎందుకంటే... అప్పటికే మోదీ కంటే ముందుగానే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకోగా...సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ ఇతర మంత్రులు, పార్టీ నేతలంతా కలిసి సిన్హాతో పాటే జల విహార్‌కు వెళ్లిపోయారు. అయితే నగరానికి చెందిన మంత్రి కావడంతో తన పార్టీ నేతలంతా జల విహార్‌కు వెళ్లిపోయినా తలసాని ఒక్కరు మాత్రం మోదీకి ఆహ్వానం పలికేందుకు బేగంపేటలోనే ఉండిపోయారు.