మోడీ సేల్స్ మాన్ : కెసిఆర్
యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇవ్వాలని డిమాండ్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హాది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
మోదీ పాలనలో అంతా తిరోగమనమే అని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని సీఎం కేసీఆర్ విమర్శించారు. మోదీ ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే ప్రధాని మోదీని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీపాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు. మోదీ ప్రధానిగాకాదు..దోస్త్ కోసం షావుకార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా..విదేశాలనుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తున్నదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మోదీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ఎద్దేవా చేశారు.
రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మీరు దేశం ముందు తలదించుకున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ సమావేశంలో మీ ప్రసంగమే కాదు.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. మోదీని చూసి పెద్దపెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయన్నారు. రూపాయి పతనం చూస్తే మోదీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. మోదీ షావుకార్ల సేల్స్‌మేన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్దమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ విధానాలతోనే తమకు అభ్యంతరమని పేర్కొన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్ లోక్‌సభలో గళం విప్పారని చెప్పారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు. టీఆర్‌ఎస్ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్ సవివరంగా చెప్పారు. తెలంగాణలో ప్రజా చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేము. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిదికాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం?. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్ కోసం కాదు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమిది’ అని యశ్వంత్ సిన్హా అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.