home page

పేద ముస్లింలపైనే కమలం గురి

 | 
Modi


దేశంలో ముస్లిం ఓటుబ్యాంకును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న పార్టీలకు బిజెపి షాక్ ఇవ్వనుంది. అందుకోసం ఆయా పార్టీల దిమ్మతిరిగి పోయేలా వ్యూహం రచించింది.

రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన కాషాయ పార్టీ.. తాజాగా పస్మాండ ముస్లింలను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా యోచిస్తోంది. వెనుకబడిన ముస్లిం సామాజికవర్గాలను ఆకర్షించేలా సరికొత్త ఆలోచనను అమలు చేయనుంది.

మోదీ, షాలను మించిన రాజకీయ చాణక్యులకు దేశంలో ఏ వర్గాన్ని ఎలా ట్యూన్ చేయాలనేది వెన్నతో పెట్టిన విద్య. రాజకీయం అంటే ఆలోచన. ఆవేశం కాదు. కనీసం ఆవేశంతో ఆలోచన కూడా చేయకూడదని రాజకీయంలో వారు నిరూపించారు. దీంతో ఏదో జరిగిపోతుందని అనుకున్న వారికి షాకిచ్చారు. ఇప్పుడు వారి ఆలోచనల్లోంచే మరో వ్యూహం ఆరంభమైంది. అదే. ముస్లిం పార్టీలతో ఓట్లాట ఆడుతున్న పార్టీలకు చెక్ పెట్టడం. అందుకోసం దేశంలోని ముస్లిం రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాగలిగే అంశమే 'పస్మాండ ముస్లింలు'. ఈ పస్మాండా ముస్లింలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు బీజేపీ కార్యాచరణ అమలు చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో.. సాక్షాత్తూ ప్రధాని మోడీ పార్టీ కార్యకర్తలను దేశంలోని పస్మాండ(పర్షియన్ బాషలో వెనుకబడిన అని అర్థం) ముస్లింలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ జిల్లా యూనిట్‌లో వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. బీజేపీలో వారికి సరైన ప్రాతినిథ్యం దక్కేలా ఉండాలని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పొందిన పస్మాండ ముస్లింల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ సమావేశంలో ప్రధాని మోడీ తన ప్రసంగంలో రాజవంశ రాజకీయాలను నిందించారు. కుటుంబ పాలనను ప్రోత్సహించే వారితో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పస్మాండ ముస్లింల మద్దతును పొందేందుకు బీజేపీ కృషి చేయాలని మోడీ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తానికి ప్రధాని మోడీ వ్యాఖ్యల వెనుక సమాజ గతిని మార్చే, ముస్లిం ఓటుబ్యాంకును తమ వైపు లాక్కునే రాజకీయ మర్మం ఉందనేది వాస్తవం.

నిజానికి ముస్లింలలో 90:10 స్ధానంలో ఉండేలా.. ముస్లింలలో ఎక్కువ మంది ఓట్లను పొందేలా బీజేపీ ప్లాన్‌లో ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీకి ముస్లింలలో 90:10 ఎందుకు కావాలంటే.. పస్మండ ముస్లింలు.. ముస్లింలలో అత్యంత వెనుకబడిన విభాగంగా పరిగణించబడుతుంది లేదా ముస్లిం సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ముస్లింగా పరిగణించబడుతుంది. గణాంకాల పరంగా దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో 70 శాతం పైగా పస్మాండ ముస్లింలు ఉన్నారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల్లోని ముస్లిం నేతలు అష్రఫ్ నుంచి వస్తున్నారు. ముస్లింలలో అష్రఫ్‌లను సయ్యద్‌లుగా, మొఘలులుగా, పఠాన్‌లను హిందువులలో అగ్ర కులాలుగా పరిగణిస్తారు.

దేశంలోని పస్మాండ ముస్లింలలో ఎక్కువ మంది ఓట్లను పొందేలా బీజేపీ ప్లాన్‌లో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. బిజెపి ఒక పొలిటికల్ పిచ్ ను సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి ముస్లిం ఓటుబ్యాంకును పెద్దమొత్తంలో పెంచుకునేందుకు కాషాయ పార్టీ అడుగులు వేస్తోంది.