home page

ఒకే ఒక్కడు, నిగ్గదీసి అడుగు తున్న ఉక్కు మనిషి కేసీఆర్!

  కేసీఆర్ నోట...       కమలం కకావికలం 

 | 
Kcr with india today
*ఒకే ఒక్కడు.. నిగ్గదీసి అడుగుతున్న ఉక్కుగళం:*
దేశమంటే మతమా? మనుషులా? రాజకీయమంటే ప్రజల ప్రయోజనాలా?
భావోద్వేగంలో ముంచే ప్రయత్నాలా?
సైన్యమంటే జమా ఖర్చులు చూసే ఉద్యోగమా?
ప్రాణాన్ని సైతం త్యాగం చేసే పరమార్థమా?
దేశభక్తి అంటే కేవలం మాటల్లో చూపించే మర్యాదపూర్వక నినాదాలా?
లేక అగ్రదేశంగా నిలిపే అభ్యున్నతా?
అరుపులు, కేకలు, ప్రచారాలు, దుష్ప్రచారాల నడుమ చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతూ, ఏది నిజమో? ఎది అబద్ధమో, ఏమంటే ఏ రాజద్రోహ, దేశద్రోహ, మతద్రోహ ముద్ర పడుతుందో అని అయోమయ గందరగోళంలో సాగుతున్న భారతదేశ ఆలోచనా పరులకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌.. ఇచ్చిన లైన్‌ ఒక మార్గనిర్దేశం.
రాజకీయ దురుద్దేశంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న శక్తులను కట్టడి చేయాలంటే ఒక శక్తివంతమైన స్వరం అవసరం ఉంది అని నోబెల్‌ గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అర్థిక శాస్త్ర నిపుణులు అమర్త్యసేన్‌ అభిప్రాయడ్డ రోజే కేసీఆర్‌ రూపంలో ఒక సుస్పష్ట స్వరం, విస్పష్ట వాదం, ఏది నిజమైన దేశభక్తి, ఏది అసలైన అభివృద్ధి అని చెప్పేలా కేసీఆర్‌ ప్రజెంట్‌ చేసిన ఆర్గ్యుమెంట్‌ నాతోపాటు అనేకమందిని ఆశ్చర్యపరిచింది. అమర్త్యసేన్‌తోపాటు భారతావనిలోని చాలా మంది మేధావులు, బుద్ధి జీవులు మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ప్రజలకు అర్థం అయ్యే విధంగా బహిర్గతం చేసి, ప్రజల్ని మేలుకొలిపే బాధ్యతను ఒక ప్రజా నాయకుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలాకాలం నుండి కోరుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్‌ ప్రసంగం వారి ఆశలను, అంచనాలను దాటిపోయేలా ఉంది.
40 శాతానికి లోపు ఓట్లతో అధికారంలోకి వచ్చి ఎవరినీ లెక్కచేయకుండా, భవిష్యత్‌ పర్యవసానాలను పట్టించుకోకుండా, ఏ వ్యవస్థకూ జవాబుదారీ తనం వహించకుండా వ్యవహరిస్తున్న నరేంద్రమోదీ సర్కారును బోనులో నిలబెట్టే బాధ్యతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు ప్రస్ఫుటమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే కేంద్ర ప్రభుత్వ పరిపాలనను కేసీఆర్‌ ఎండగట్టిన తీరు విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. గత ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో చేతగాని, చేవలేని వారి చేతిలో ఈ దేశం, దాని భవిష్యత్తు, భద్రత ప్రమాదంలో పడ్డాయని దాదాపు 2 గంటలకు పైగా పత్రికా సమావేశం నిర్వహించి మరీ ప్రజలకు అర్థమయ్యేవిధంగా ఏ నాయకుడూ చెప్పిన సందర్భాలు లేవు. ఎనిమిది ఏండ్లలో ఈ విధంగా విడమరచి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్‌.
ఈ దేశాన్ని బీజేపీ తన ప్రయోగశాలగా మార్చుకున్నదని, ఈ క్రమంలో దేశ ప్రజలు గినియాపిగ్‌లుగా మారి కఠోర పర్యవసానాలను అనుభవిస్తున్నారని, ఇది భరతజాతికి ఎంతమాత్రం క్షేమకరం కాదని కేసీఆర్‌ హెచ్చరించిన తీరు ఒక దేశభక్తుడి, ఒక భూమి పుత్రుడి అసలైన ప్రేమకు నిదర్శనం. కొత్తగా సాధించుకున్న తన రాష్ర్టాన్ని పునర్నిర్మాణం చేయాలనే గురుతరమైన బాధ్యత తన భుజస్కంధాలపై ఉండడంవలన ఎనిమిదేండ్లు సంయమనం పాటించానని ఇప్పుడు ఇక దేశం కోసం కదలాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్‌ చెప్పడం.. ఆయన వ్యూహచతురతకు తార్కాణం. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏ దాడి జరుగుతుందో, ఏ కేసు పడుతుందో, ఏ ముద్ర వస్తుందో, ఏ దర్యాప్తు సంస్థ పిలుస్తుందో అని దేశం దేశమే భయమనే బందిఖానాలో స్వచ్ఛందంగా తనను తాను ఖైదుచేసుకొని నోరు మెదపడానికి, గొంతు విప్పడానికి జంకుతున్న తరుణంలో తన రాజకీయ బలమెంత, బలగమెంత అనే లెక్కలు వేసుకొని ఆగిపోకుండా గుప్పెడంత గుండెబలం, పిడికెడంత పట్టుదల, అపారమైన మేధస్సు, అనితర సాధ్యమైన ఆలోచన ఆలంబనగా భరతమాత శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్‌ చేస్తున్న సాహసం నిజంగా అభినందనీయం, ఇటువంటి ఆలోచన ఉన్న అందరికీ స్ఫూర్తిదాయకం.
దేశం ఈ విధంగా విద్వేష రాజకీయాలతోనే కొనసాగితే వంద సంవత్సరాలు వెనక్కు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనతో, ఇలాంటి విద్వేష రాజకీయాల నుండి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వుందని నిర్ణయించుకున్న కేసీఆర్‌, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో గత కొంతకాలంగా నిరూపిస్తున్నారు. గడచిన 75 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ సరిగ్గా పాలించి ఉంటే ప్రజలకు నీటి కష్టాలు, విద్యుత్తు కష్టాలు ఉండేవి కావని, భారత దేశ యువత అత్యధికంగా నిరుద్యోగంతో బాధపడే పరిస్థితి వచ్చి వుండేది కాదని ప్రజలకు అర్థమయ్యే విధంగా గణాంకాల తో కేసీఆర్‌ నిన్నటి ప్రెస్‌ మీట్‌ లో వివరించారు.
ఈ పరిస్తితిని చక్కదిద్దుతానని ‘అచ్చే దిన్‌ ‘ అనే సుందర స్వప్నాన్ని , గుజరాత్‌ మాడల్‌ అనే ఒక డొల్ల మాడల్‌ను దేశం ముందు ఉంచి అధికారం కైవసం చేసుకున్న మోదీ, తన అస్తవ్యస్త పాలనతో దేశాన్ని మరింత దిగజార్చారని కేసీఆర్‌ నిరూపించారు.
రూపాయి పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్దక ఆస్తుల పెరుగుదల, నిరుద్యోగ రేటు పెరుగుదల, వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారతదేశం దిగజారిన తీరు, LPG, పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల, దిగజారిన GDP వృద్ధి రేటు మొదలైనవాటిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలతో కేసీఆర్‌ నిరూపించారు. బ్రిటిష్‌వారు ప్రకటించిన గణాంకాలను ఉపయోగించి భారత దేశాన్ని ఏ విధంగా దోచారో  దాదా భాయ్ నౌరోజి 1901 లో తన Poverty And UnBritish Rule In India పుస్తకంలో విడమర్చి చెప్పినట్లుగా కేసీఆర్‌ ఈ ఎనిమిది ఏళ్లలో మోదీ ప్రభుత్వం వలన భారత దేశానికి జరిగిన నష్టాలను విడమర్చి, గణాంకాలతో ప్రజలకు నిన్నటి ప్రెస్‌ మీట్‌ లో వివరించారని మేధావులు, అనేక మంది సామాన్య ప్రజలు భావిస్తున్నారు.
ప్రతీ గంభీరమైన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మోదీ తన రాజకీయ పబ్బం గడుపుతున్నాడని, ఇది దేశాన్ని100 సంవత్సరాలు వెనక్కి నెడుతుందని, కాశీకి చెందిన కరపాత్ర స్వామి 60 సంత్సరాలకు ముందే ఆర్‌ ఎస్‌ ఎస్‌ సనాతన ధర్మానికి వ్యతిరేకం అని ఆయన సనాతన్‌ పేరుతో పుస్తకం రాయడాన్ని కేసీఆర్‌ వివరించారు. దేశాన్ని, ప్రజాస్వామిక భ్రష్టు పట్టించే రాజకీయం చేస్తున్నారని, సుప్రీంకోర్ట్‌, హైకోర్టు జడ్జిలను సోషల్ మీడియాలో  తప్పుడు రాతలు రాయడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య దేశంలో సహించరాని నేరంగా, ప్రజాస్వామ్యనికే ముప్పుగా పరిగణించాలని కేసీఆర్‌ అభిప్రాయ పడ్డారు.
కేసీఆర్‌ సామర్థ్యాన్ని ముందే అంచనా వేసిన బీజేపీ అగ్ర నాయకత్వం, కేసీఆర్‌ను తెలంగాణలోనే కట్టడి చేయాలనే కుతంత్రంతో అనేక పన్నాగాలు చేస్తున్నది. అందులో భాగంగానే హైదరాబాద్‌ లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది అనేది సామాజిక స్పృహ కలిగిన ప్రతి వ్యక్తికీ అర్థమయ్యే విషయమే. అయితే తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర్నుండి చూసినవారికి కేసీఆర్‌ను ఆ విధంగా బీజేపీ కట్టడి చేయలేదని తెలిసిపోతుంది. తెలంగాణ మాడల్‌, ప్రత్యామ్నాయ అజెండాతో గుణాత్మక మార్పు కొరకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌, భారతదేశ ప్రజలను జాగృతం చేయడంలో సఫలం చెందాలని, మూస రాజకీయ పద్ధతుల నుండి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ రూపాంతరం చెందాలని బుద్ధి జీవులు కోరుకుంటున్నారు.

– పెండ్యాల మంగళాదేవి