అఖిలేష్ యాదవ్ తో కేసిఆర్ భేటీ
బిజెపి వ్యవహార శైలిపై ఇరువురి మధ్య చర్చ

బీజేపీపై వార్ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో చక్రం తిప్పుతున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.
ఇక, దేశంలో తాజా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. శనివారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్-23లోని కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్.. జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టులతో భేటీ కానున్నట్టు సమాచారం. కాగా, కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు.
ఇదిలా ఉండగా.. గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌సింగ్ కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు.
అనంతరం, ఈ నెల 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో, 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. షిర్డీ సాయిబాబా దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తిరిగి ఈ నెల 29 లేదా 30న పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం వెళ్లే అవకాశం ఉంది.