home page

రూపాయి పతనం: వంచనకూ హద్దుంటుంది

నరేంద్ర మోడీ గారు వినండి    !జనం మాట ఇదిి!!

 | 
Modi

రూపాయి పతనం : వంచనకూ ఒక హద్దుంటుంది :నరేంద్రమోడి ,

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా మిత్రోం !


ఎం కోటేశ్వరరావు


” గతంలో భారత ప్రధానులు అమెరికా అధ్యక్షులను కలుసుకొనేందుకు వారి దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన ప్రధాని దగ్గరకు వస్తున్నారు. అదే నరేంద్రమోడీ గొప్పతనం ” ఇది ఇటీవలి జి7 దేశాల సమావేశం తరువాత సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక పోస్టులోని అంశం. నిజమే ఆ దృశ్యాన్ని చూసి యావత్‌ నరేంద్రమోడీ భక్త జనులు ఆనందపారవశ్యంతో ఆ బొమ్మ ముందు పొర్లు దండాలు కూడా పెట్టి ఉండవచ్చు. ఎవరిష్టం వారిది. ప్రపంచ నేతలతో అందునా అమెరికా నేతలతో కౌగలించుకొనే చనువు మన ప్రధానికి ఉంది గనుక మరొకటి కూడా జరిగి ఉండవచ్చు. ” ఏమిటి మోడీ గారు మా డోనాల్డ్‌ ట్రంప్‌నైతే కౌగలించుకొని చెట్టపట్టాలు వేసుకొని మరీ మధుర భాషణలు జరిపారు. నన్ను చూసి కూడా చూడనట్లు అటు తిరిగి మాట్లాడుతున్నారేం ” అంటూ వెనుక నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నరేంద్రమోడీ భుజం తట్టి మరీ పలకరించి ఉండవచ్చుగా ! వసుదేవుడు అంతటి వాడు తన పని జరిపించుకొనేందుకు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న పురాణ కధ చదివాము. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో తన అవసరం కోసం గత ఐదునెలల్లో బెదిరింపులు-బుజ్జగింపులతో మన దేశాన్ని తనవైపు తిప్పుకొనేందుకు అమెరికా చూస్తున్నదనేది కూడా జగమెరిగినదే. దానిలో భాగంగా కూడా జో బైడెన్‌ వెనుక నుంచి తట్టి మరీ నరేంద్రమోడీని పలుకరించి ఉండవచ్చు మీ వైఖరిని మార్చుకున్నారా అని అడిగి ఉండవచ్చు. అవసరం వారిది కదా ! ఏదైనా దాన్ని వదలివేద్దాం, దీనితో దేశానికి ఒరిగిందేమిటి, జనాలకు దక్కిందేమిటి ?


నరేంద్రమోడీని విశ్వగురువుగా మన జనాలకు చూపేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి వారి సలహాలతో మద్దతుదారులు ఇలాంటివి ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. గతంలో చాయవాలా బ్రాండ్‌,ఎన్నికల సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి కూర్చోబెట్టటం, బిజెపి నేతలు టీ అమ్మటం వంటి జిమ్మిక్కులన్నీ దానిలో భాగమే కదా ! చాయవాలా తరువాత చౌకీదారు బ్రాండ్‌తో ముందుకు వచ్చారని తెలిసిందే ! ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి చేస్తున్నదేమిటి ? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం ? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా జనానికి మతిమరుపు వచ్చినా అవసరం గనుక చెప్పుకోక తప్పదు. భజన తప్ప మరొకటి మాకు పట్టదని భక్తులు అంటారా ? వారిని వదలివేద్దాం ! తమ అవసరాల కోసం నరేంద్రమోడీని విదేశాలు – కార్పొరేట్‌లు మునగచెట్టు ఎక్కించవచ్చు, మీడియాలో గొప్పతనాన్ని గుప్పించవచ్చు. దానికి అనుగుణంగానే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ మోడీ గారు సుభాషితాలను వల్లిస్తున్నారు. ఒకటి మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి జనాన్ని ఆకట్టుకోవటంలో నరేంద్రమోడీకి ప్రస్తుతం దేశంలో మరొకరు సాటిరారు. అందునా వేషం-భాషల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.


” యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి ” 2013 నవంబరు 21న పిటిఐ వార్తకు శీర్షిక. ” ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది.( ఆరోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు)” ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ” యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం ” అన్నారు.


రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది.” ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం, కానీ జరిగిందేమీ లేదు. ” అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.


2018 సెప్టెంబరు మూడున ద క్వింట్‌ పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణ ” రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువు ా ప్రాణాలతో పోరాడు తోంది ” అని 2013లో నరేంద్రమోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి, సెప్టెంబరు మూడున తొలిసారిగా రు. 71.11గా ఉంది అంటూ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్రమోడీ గట్టిగా ఇలా చెప్పారు.” నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు అది ఇంతవేగంగా పతనం కాకూడదు.ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది” అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ” ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.” బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ ” ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్నిగురించీ చెప్పటం లేదు.” అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌డిటీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ” ఈ పతనం(2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.” గార్గ్‌ మాటల తరువాత ” వంచనకూ ఒక హద్దు ఉంటుంది ” అన్న నరేంద్రమోడీ చెప్పిన ఒక మాటను చూపి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్రమోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో !


. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, ఇప్పుడు 79 దాటింది. పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు ? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా ?


2022 జూలై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాట నుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్రమోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31నాటికి 633.6 బి.డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బి.డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి.2022లో 95.6 బి.డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు పతనం మంచి రోజుల్లో భాగమే అని బిజెపినేతలైనా చెప్పాలి కదా మిత్రోం !