ప్రతి సూచీ పతనమే! అన్నింటా అధ్వాన్నంగా
మోడీ మాటలన్నీ గుజరాతీకి మూటలే!
ప్రతి సూచీ పతనమే!
అంతర్జాతీయంగా మంటగలుస్తున్న పరువు
విదేశాలలో దిగజారిన భారత పాస్‌పోర్టు ప్రతిష్ఠ
సర్వేలు అశాస్త్రీయంగా ఉన్నాయంటూ కేంద్రం వంకలు
బీజేపీ పాలనలో తిరోగమనం.. పలు సర్వేల్లో వెల్లడి
ఆరు ప్రధాన సూచీల్లో భారత్ ర్యాంకు దారుణం
ఆకలి సూచీల్లో ప్రమాదకర స్థితిలో భారతదేశం
ప్రగతికి కొలమానాలుగా భావించే పలు జాతీయ, అంతర్జాతీయ సూచీల్లో దేశం నేలచూపులు చూస్తున్నది. దాదాపు అన్ని అంశాల్లోనూ దేశం తిరోగమన దిశలోనే ప్రయాణిస్తున్నది. పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు, నివేదికలన్నీ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సూచీలను కనీసంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. అనుకూలంగా వచ్చే సర్వేలను తమ గొప్పతనంగా ప్రచారం చేసుకొంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ప్రతికూల సర్వేలను మాత్రం తిట్టిపోస్తున్నది. సర్వేలు శాస్త్రీయంగా లేవంటూ తన వైఫల్యం నుంచి తప్పించుకొంటున్నది.
ఆకలి సూచీలో ఘోరం
ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దారుణంగా దిగజారింది. 116 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం 101వ స్థానంలో ఉన్నది. అంతే కాకుండా అత్యంత ప్రమాదకరంగా ఉన్న 31 దేశాల్లో మనదేశం కూడా ఒకటి కావడం మరింత దారుణం. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం ఈ నివేదికను తప్పు పట్టింది. అంతర్జాతీయంగా ఎంతో పేరొందిన ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ చేసిన సర్వే ఇది. ప్రపంచమంతా ఎంతో విశ్వసనీయత ఉన్న ఈ సంస్థ సర్వేనే కేంద్రం అశాస్త్రీయ సర్వే అంటూ ముద్రవేసింది. ఎఫ్‌ఏవో అనుసరించే ఆకలి సూచీ లెక్కింపు విధానం శాస్త్రీయంగా లేదంటూ వ్యాఖ్యానించింది. ఫోన్ ద్వారా నాలుగు ప్రశ్నలపై ఒపీనియన్ పోల్ తీసుకొన్నదని, క్షేత్రస్థాయి పరిస్థితులను, వాస్తవాలను తెలుసుకోకుండా నివేదిక వెల్లడించిందని బుకాయించింది. కానీ వాస్తవం వేరే ఉన్నది. ఆకలి సూచీ నివేదిక నిర్వహణకు ఎఫ్‌ఏవో ఫోన్ సర్వే చేపట్టలేదు. క్షేత్రస్థాయిలోనే సర్వే నిర్వహించింది. విచిత్రమేమిటంటే.. ఇదే సూచీ ఆధారంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీహార్‌లో అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం.
పాస్‌పోర్ట్ ఖ్యాతి దిగజారింది
ఇండియన్ పాస్‌పోర్ట్ ఖ్యాతిని పెంచినట్లు ప్రధాని మోదీ ఒకసారి.. ఆయన దోస్తు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి చెప్పుకొచ్చారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లను ‘మీరు మోదీ దేశం నుంచి వచ్చారా?’ అని అడుగుతున్నారని బాకాలూదారు. కానీ ఒక్క సంవత్సరంలోనే మన పాస్‌పోర్ట్ ఖ్యాతి 8 స్థానాలు దిగజారింది. 2020లో 82వ స్థానంలో ఉన్న పాస్‌పోర్ట్ ప్రతిష్ఠ 2021లో 90వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో మన దేశం తజకిస్తాన్, బుర్కినా ఫాసో దేశాలతో సమానంగా ఉండటం దిగజారుడుకు నిదర్శనం. మోదీ ప్రధాని అయిన తరువాత పాస్‌పోర్ట్ ఖ్యాతి ర్యాంకింగ్‌లో భారత్ ఏకంగా 14 స్థానాలు పడిపోయింది. 2014లో మనదేశం ర్యాంకు 76గా ఉన్నది.
ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ విఫలం
ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడ్డ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఇందుకు డెమోక్రసీ ఇండెక్స్ తార్కాణం. ప్రజాస్వామ్య సూచీలో ఎనిమిదేండ్లలో ఏకంగా 20 స్థానాలు దిగజారింది. 2014లో 33 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 53 స్థానానికి పడిపోయింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే యత్నంచేసింది. ఇందులో కూడా నివేదికనే తప్పుపట్టింది. తమ ప్రభుత్వం అన్ని రకాల సంస్థలకు, దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీస్ ర్యాంకింగ్‌పై మాత్రం కేంద్రం మౌనంగా ఉన్నది. టాప్ 500 యూనివర్సిటీల్లో మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ లేకపోయినా కేంద్రానికి చీమకుట్టినైట్టెనా లేదు. నలంద వంటి గొప్ప విద్యాసంస్థలకు నెలవైన దేశం నుంచి ప్రపంచ టాప్ 500 ర్యాంకింగ్స్‌లో ఒక్క విద్యా సంస్థ లేకపోవడంపై విద్యావేత్తలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
గొప్పల తిప్పలు
ప్రపంచ ఆకలి సూచీ, పాస్‌పోర్ట్ సూచీ, ప్రపంచ సంతోష సూచీ, ప్రజాస్వామ్య సూచీ, లింగభేద సూచీల్లో భారత్ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. దీనిపై సోషల్ మీడియాలో వరల్డ్ రిపోర్ట్ కార్డ్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ప్రచారం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ఎంతో మెరుగైందని గొప్పలు చెప్పుకున్నది. వాస్తవం ఏంటంటే… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ప్రపంచ బ్యాంకు నిరుడు సెప్టెంబర్‌లోనే నిలిపేసింది. పలు దేశాలు తప్పుడు వివరాలు ఇస్తున్నట్టు తమ పరిశోధనలో తేలిందని, అందుకే ర్యాకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నది. ఇలాంటి విలువ లేని రిపోర్ట్‌లను తమ గొప్పల కోసం మోదీ సర్కారు ప్రచారం చేసుకున్నది. అదే పై ఐదు సూచీలకు సంబంధించిన నివేదికలను మాత్రం తప్పుడు నివేదికలని, ఆశాస్త్రీయమైన నివేదికలు అని కొట్టిపారేసింది.
భావి తరాలను నిరాశపరచొద్దు
పర్యావరణ సూచీలో భారత్‌కు 180వ ర్యాంక్
రాష్ర్టాలు, కేంద్రం ఆత్మపరిశీలన చేసుకోవాలి: మంత్రి కేటీఆర్
పరిరక్షణ పనితీరు సూచీ (ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫామెన్స్ ఇండెక్స్-ఈపీ)లో భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అట్టడుగున నిలవటంపై పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ 180 వ ర్యాంకుకు దిగజారడంపై ఆవేదన చెందారు. ‘180వ ర్యాంకుతో అట్టడుగున భారత్.. ఈ నివేదిక అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణలో హరితహారం తరహాలో తీవ్రమైన ఆత్మపరిశీలన, కార్యాచరణ ప్రణాళికను కోరుతున్నది. మన భవిష్యత్తు తరాలను మనం నిరాశపరచలేం’ అంటూ గురువారం ట్వీట్ చేశారు.