home page

తెలంగాణలో ముందస్తు వణుకు

ఆత్మ రక్షణలో అన్ని రాజకీయ పార్టీలు 

 | 
Car

విపక్షాలకు ముందస్తు వణుకు

2018లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొట్టిన చావుదెబ్బ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికీ కోలుకొన్నట్టు కనిపించడం లేదు.

ఆ రెండు పార్టీల నాయకులకు కలలో కూడా 'ముందస్తు' పదం వణుకు పుట్టిస్తున్నది. నిజానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగవని సీఎం కేసీఆర్‌ పలుమార్లు స్పష్టంచేసినా.. టీఆర్‌ఎస్‌ నాయకులు పదే పదే చెప్పినా.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం అదే మేనియాలో ఉండిపోతున్నారు. 

దీంతో ఆదివారం నాటి మీడియా సమావేశంలో ముందస్తు ఎన్నికలకు అంతగా ఆత్రంగా ఉంటే.. మీరే ఏదైనా తేదీ ప్రకటించండి.. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసరగానే.. ఒక్కసారిగా విలవిల్లాడిపోయారు. ఎడతెరిపిలేని వర్షాలతో జనం చలితో వణికి పోతుంటే, సీఎం కేసీఆర్‌ సవాల్‌ విపక్షాల నేతలకు చలిజ్వరం తెప్పించింది. ఏంచేయాలో తోచక ముఖ్యమంత్రే ముందస్తుకు వెళ్తున్నారంటూ పెడబొబ్బలు మొదలుపెట్టారు. విపక్షాల నేతలకు అంతగా దమ్ముంటే.. ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరించవచ్చుకదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఒక తేదీ ప్రకటిస్తే.. తాను ఎన్నికలకు రెడీ అని సీఎం కేసీఆర్‌ బాజాప్తా చెప్పినప్పుడు.. దానికి సూటిగా స్పందించకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం సిట్టింగ్‌ స్థానాలను కూడా నిలబెట్టుకోలేని దుస్థితి దాపురిస్తే..

అత్యంత ఘోరంగా ఒకే ఒక్క సీటు

గెల్చుకొని.. మిగతా పోటీ చేసిన 108 స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకొన్న ఘనత బీజేపీది. పైకి మేం రెడీ అంటే.. మేం రెడీ అని జబ్బలు చరుచుకొంటున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కేసీఆర్‌ను ఢీకొనడం ఎంతవరకు సాధ్యమని గుబులుపడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి తమ పార్టీ తరఫున పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 119 మంది నాయకులను 119 నియోజకవర్గాలకు పంపించారు. నియోజకవర్గానికి ఒకరినైనా పట్టుకొచ్చుకొని పార్టీ కండువా కప్పాలని తెగ ఆరాటపడ్డారు. వివిధ పార్టీల నేతల ఇండ్లకు వెళ్లి మరీ అడిగొచ్చారు. చివరకు ఏ పార్టీలో లేని.. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ట్విట్టర్‌ పిట్ట కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఇంటికెళ్లి మరీ బతిమాలి చేర్చుకొన్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా చేరికల కమిటీలను పెట్టుకొన్నాయి. కానీ చేరడానికి ఎవరు ముందుకొస్తారన్నది వారికీ అనుమానమే.

10 సీట్ల కంటే ఎక్కువరావు: బీజేపీ
విపక్షాల నేతలు పైపైకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా.. లోపల మాత్రం ఒకవేళ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటని ఇటు బీజేపీలోనూ, అటు కాంగ్రెస్‌లోనూ సోమవారం చర్చోపచర్చలు జరిగాయి. ఉన్నపళంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లగలిగే స్థితిలో ఉన్నామా? అని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమకుతాముగా బేరీజు వేసుకుంటూ చర్చించుకున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు వచ్చే గ్యారంటీ లేదని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా సీఎం కేసీఆర్‌ ముందస్తుకు బస్తీమే సవాల్‌ అనడంతో పార్టీలో అమిత్‌ షా వ్యాఖ్యలు-కేసీఆర్‌ సవాల్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ సమావేశాలు హైదరాబాద్‌లో ముగిసిన రోజు 3 వ తేదీ రాత్రి పార్టీ ముఖ్యనేతలతో అమిత్‌ షా, నడ్డా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా చర్చల్లో ముందస్తు ప్రస్తావన రాగా తమకున్న సమాచారం, సర్వేల ప్రకారం బీజేపీకి 10-12 కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదని అమిత్‌ షా గుర్తు చేసినట్టు తెలిసింది.

గత ఎన్నికలకు ముందు నాటి కంటే పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా బీజేపీ గురించి పదే పదే మాట్లడటం వల్లనే పార్టీ లైవ్‌లో ఉంది తప్ప సంస్థాగతంగా పుంజుకోలేదని కూడా జాతీయ నాయకులు గుర్తు చేసిన విషయం తాజాగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసినంత మాత్రాన పార్టీ బలపడినట్టు కాదని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత లేదని, గ్యాస్‌ సిలిండర్‌ ధర, పెట్రోల్‌, డీజిల్‌, మంచినూనె, నిత్యావసర వస్తువుల పెరుగుదల, యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలుకు కేంద్రం నిరాకరించడం వంటి చర్యలతో గత ఎన్నికలకు ముందు కంటే పార్టీ ప్రతిష్ఠ ఇంకా దిగజారిపోయినట్టు పార్టీ అంతర్గత చర్చల్లో ముఖ్య నేతలు వాపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల సవాళ్లపై మొక్కుబడిగా స్పందించడం ఉత్తమమని లేని పక్షంలో పార్టీ పుట్టి మునిగే ప్రమాదం ఉన్నదని రాష్ట్ర నేతలను పార్టీ అధిష్ఠానం హెచ్చరించినట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ది అస్త్ర సన్యాసమే
ముందస్తు ఎన్నికలు జరిగితే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఆ పార్టీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కయ్యానికి కాలు దువ్విన అప్పటి టీపీపీసీ అధ్యక్షుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనకు సంబంధం లేకపోయినా పాలక పార్టీని మళ్లీ రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేశారని ఆ పార్టీ వర్గాలు అప్పుడే విమర్శించాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరులో తలదూర్చకపోవడమే మంచిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ముందస్తుకు వెళ్తే పార్టీ మరింత దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. టీపీపీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకమై ఏడాది అవుతున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ బలపడలేదంటున్నారు. రాష్ర్టానికి నలుగురు ఏఐసీసీ ఇంచార్జిలను నియమించినా, రాహుల్‌గాంధీ అనేకసార్లు రాష్ట్ర నేతలతో సమావేశమైనా టీపీసీసీ ఇప్పటికీ గాడిన పడలేదని చెప్తున్నారు.

పార్టీ ఏ మేరకు బలపడిందో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలే అద్దం పడుతున్నాయని, దాదాపు అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల మధ్యన సమన్వయ లోపం, పార్టీ రాష్ట్ర అధినేత రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలపై సీనియర్ల గుర్రు, విమర్శలు, ఆరోపణలు, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి ఎంపీలు దూరంగా ఉండటం, గాంధీభవన్‌ మెట్లు ఎక్కేది లేదని ప్రతినలు, గత ఎన్నికలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఏఐసీసీ సస్పెండ్‌ చేస్తే పార్టీ అధిష్ఠానం అనుమతి లేకుండానే తిరిగి పార్టీలో చేర్చుకోవడం, పార్టీలో రోజు రోజుకు ముదురుతున్న గ్రూపుల తగాదాలు, ఆధిపత్యపోరుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అతలాకుతలం అవుతున్నట్టు ఆ పార్టీ పెద్దలే విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్‌ పార్టీ మునుపటి కంటే ఘోరమైన పరాభావాన్ని చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు.