home page

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’కు పెద్దపీట

ఉత్తరాదిన టాప్‌న్యూస్‌గా నిలిచిన 
     రైతులకు ఉచిత విద్యుత్తు హామీ
 | 
Kcr
 దేశవ్యాప్తంగా మీడియాలో 
ప్రముఖంగా వార్తా కథనాలు

జాతీయ మీడియాలో కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్రికలు ఆ వార్తలను పతాక శీర్షికలతో ప్రజలకు చేరవేశాయి. టీవీలు ప్రత్యేక చర్చాగోష్టులతో హోరెత్తించాయి. వెబ్‌సైట్లు సైబర్‌ ప్రపంచంలో వేడిని పుట్టించాయి. దేశప్రజల ఆలోచనలో తెలంగాణ కేంద్రస్థానంలోకి వస్తున్నది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తెస్తామంటూ సీఎం కేసీఆర్‌ వేసిన పొలికేక కాకలు పుట్టిస్తున్నది. కేసీఆర్‌ మాటకు మీడియా పెద్దపీట వేయడం రాబోయే పెనుమార్పులకు సంకేతమా? అని రాజకీయ పరిశీలకులు చర్చించుకొంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ సభలో ఆయన జాతీయ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు దేశంలోని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.

బీజేపీయేతర సర్కారు వస్తే రైతులకు ఉచిత కరెంటు ఇస్తామనే నినాదానికి అవి ప్రాముఖ్యం ఇవ్వడం గమనార్హం. ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ సాధిద్దామని, అందుకు ప్రజలంతా కలిసిరావాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారని ఇంగ్లిష్‌ దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రాసింది. బీజేపీ ముక్త్‌ భారత్‌ అనే నినాదాన్ని బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్న సభలో మొదటిసారి కేసీఆర్‌ చేశారని గుర్తుచేసింది. జాతీయ రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషించేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్‌ భావసారూప్యత గల పార్టీల మద్దతు కూడగడుతున్నారని పేర్కొన్నది. దేశంలోని యావన్మంది రైతులకు ఉచిత కరెంటు.. ఇది కేసీఆర్‌ హామీ అని హిందీ దినపత్రిక రాష్ట్రీయ సహారా రాసింది. మరో హిందీ దినపత్రిక ‘దేశబంధు’ ఇదే తరహా శీర్షికతోపాటు బీజేపీ ముక్త భారత్‌ ఉపశీర్షికను పెట్టింది. ‘దేశమంతటా ఇక కేసీఆర్‌ ఉచిత విద్యుత్తు’ అని దినపత్రిక నవోదయం రాసింది. ‘జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌ అంగలు వేస్తున్నారని’ పేర్కొన్నది.

ప్రధాని నరేంద్రమోదీ ఉచిత పథకాలను ‘రేవడీ (తాయిలాల) సంస్కృతి’ అని విమర్శించిన నేపథ్యంలో కేసీఆర్‌ ‘ఉచిత పథకాలను యావత్తు దేశానికి విస్తరిస్తామని’ అనడం గమనార్హమని ఇంగ్లిష్‌ దినపత్రిక స్టేట్స్‌మన్‌ రాసింది. ‘దేశంలోని రైతుల సంక్షేమం కోసం పెద్దఎత్తున చర్యలు చేపడుతామని’ సీఎం కేసీఆర్‌ ప్రకటించారని హిందీ దినపత్రిక ‘నవోదయ్‌’ రాసింది. నన్ను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమంటారా? అని కేసీఆర్‌ అడిగితే సభలోని జనం ‘ఔను’ అంటూ పెద్దపెట్టున హర్షామోదాలతో సమాధానమిచ్చారని ఇంగ్లిష్‌ దినపత్రిక ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ రాసింది. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘ఈ సభతో జాతీయ రాజకీయాల్లోకి తొలిఅడుగు వేస్తున్నానని’ కేసీఆర్‌ ప్రకటించారని పేర్కొన్నది. ‘వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీయేతర పతాకం రెపరెపలాడుతుందని, విపక్షం అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్‌ తేల్చిచెప్పారని’ ఇంగ్లిష్‌ వాణిజ్య దినపత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ రాసింది. ‘తెలంగాణ అభివృద్ధి మాడల్‌తో టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు’ ఆయన ప్రకటించారని తెలిపింది. ‘ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని’ కేసీఆర్‌ అన్నట్టు ఆజ్‌తక్‌ టీవీ వెబ్‌సైట్‌ పేర్కొన్నది