home page

దేశాన్ని భ్రష్టు పట్టించిన బిజెపి

నిప్పులు చెరిగిన కేసిఆర్ 

 | 
Kcr
దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే.ఒక్కటైనా మంచి పని చేశారో దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిలో కనీసం పది శాతమైన బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయా? అని నిలదీశారు. మోడీ అంతా లొడలొడ వాగడం..అహంకార పూరితంగా వ్యవహరించడమేనని మండిపడ్డారు. దేశానికి ఆయన ఒక రాజు అనుకుంటారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి చెత్త ప్రభుత్వం ..కేంద్రంలో ఒక్క రోజు కూడా కొనసాగే హక్కులేదన్నారు. తప్పకుండా కేంద్రంలో బిజెపియేతర పార్టీల అధికారం రావాల్సిందేనని అన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ వేగంతో పనిచేస్తోందని..కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వేగం తక్కువని, రాష్ట్ర ప్రభుత్వ వేగం ఎక్కువన్నారు.
ఆదివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, మోడీపై నిప్పులు కురిపించారు. రెండు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తూర్పారబట్టారు. అలాగో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశాన్ని బిజెపి జలగలా పట్టి పీడిస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి పాలన చేతకావడం లేదన్నారు. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. బిజెపి జాతీయ కార్యవర్గ భేటీలో తాము ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదన్నారు. అశక్తులం అని తమ డొల్లతనాన్ని ఆ పార్టీ రుజువు చేసుకుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని. మోడీ చెప్పినట్టు గుర్తు చేసిన సిఎం. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాట్టు తెలిపారు. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలో కూడా రాష్ట్ర సర్కారులా వేగంగా ఉన్న ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని చెప్పారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో ఆయనే చెప్పాలి. ఆర్‌బిఐ లెక్కల ప్రకారం రాష్ట్ర జిడిపి128.3 శాతం కాగా కేంద్ర ప్రభుత్వ జిడిపి మాత్రం 89.6 శాతంగా ఉందన్నారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే రాష్ట్ర జిడిపి మరింత పెరిగేదన్నారు. బిజెపి పాలన అంతా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి, కుంభకోణాలమయమని విమర్శించారు. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందన్నారు.
కేంద్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలి
బిజెపి నాయకులు డబుల్ ఇంజన్ సర్కార్ అర్థం తెలుసుకోవాలని కెసిఆర్ సూచించారు. కేంద్రంలో బిజెపి ప్రభత్వం పోయి.టిఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలన్నారు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అంటే మిగతా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా టిఆర్‌ఎస్ వస్తుందన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ ఇంజన్ వేగంతో దూసుకపోతున్నదన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చాలా స్లోగా ఉందన్నారు. కాబట్టి టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ ఇంజర్ సర్కార్ అని అన్నారు. దేశంలో నాన్ బిజెపి సర్కార్ వస్తేనే. అది డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ వచ్చి హైదరాబాద్‌కు వచ్చి ఉత్త మాటలు మాట్లాడారని విమర్శించారు. ముందు ఆయన రాష్ట్రంలో తలసాని ఆదాయం ఎంతో తెలుసుకోవాలని సూచించారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యుపిలో తలసరి ఆదాయం ఇంకా రూ. 71వేలకు మించలేదన్నారు.
మోకాలు ఎత్తులేని దద్దమ్మలు మాట్లాడుతున్నారు?
మోకాలు ఎత్తు లేని దద్దమ్మలు కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఒకడు తమిళనాడులో ఎక్‌నాథ్ షిండే వస్తాడు అంటాడు. ఇంకొకడు తెలంగాణకు ఏక్ నాథ్ షిండే వస్తాడు అంటాడు. మీరు ఏక్ నాథ్ షిండే వారసులా? అహంకారం, బలుపు, మదంతో బిజెపి వాళ్లు పెచ్చరిల్లిపోతున్నారని విమర్శించారు.
దేశం పరువుపోతోంది
దేశాన్ని బిజెపి ప్రభుత్వం ఒక జలగలాగా పటి ్టపీడిస్తోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రియాహీనమైనటువంటి. నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదన్నారు. మోడీ అసమర్థత వల్ల దేశం పరువుపోతుందన్నారు. దేశంలో ఏటా కోటి 30 లక్షల మంది ఉద్యోగాలు చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా బిజెపి హయాంలో రూపాయి పతనమైందన్నారు. రూపాయి పతనంపై గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు మోడీ అనేక సూక్తులు మాట్లాడారన్నారు. ఏ దేశంలో పతనం కానీ రూపాయి భారత రూపాయి ఎందుకు పతనమవుతుంది? దీనికి కారణం ఏంటీ? అని నిలదీశారు. గతంలో ఎప్పుడులేని విధంగా రూపాయి పడిపోయిందన్నారు. ఇది ఆయన అవివేకమా? అసమర్థతనా? దీనికి దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మోడీ ఉద్దేశించి కెసిఆర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పకుండా డబ్బాలో రాళ్లుపోసినట్లు అరచిపోతమంటే కుదరదని హెచ్చరించారు. మోడీఅసమర్థత వల్లే రూపాయి విలువ రూ. 80కి పడిపోయిందన్నారు. దేశ ప్రజలకు విద్యుత్, తాగు, సాగునీరు ఇవ్వని అసమర్థ ప్రభుత్వం మోడీదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా 70వేల టిఎంసిల జలాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునే తెలివి మోడీ సర్కారుకు లేదన్నారు. దేశ రాజధానిలో విద్యుత్ కోతలు, మంచినీటి కొరతే మోడీ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగిత 8.3శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
చేతగాని బిజెపి సర్కారును మారుస్తాం
అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన బిజెపి సర్కార్‌ను తప్పకుండా మారుస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఇప్పటి వరకు మోడీ తన గొప్పల సొల్లు చెప్పుకోవడమే తప్ప..చేసింది శాన్యమన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్టమైన తెలంగాణకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన మోడీ ప్రభుత్వం కత్తి కట్టి, వివక్ష చూపిస్తోందన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రం అద్భుతైన ప్రగతి సాధిస్తుంటే దానిని మోడీ ప్రభుత్వం ఓర్వ లేకపోతున్నదన్నారు. ఆర్‌బిఐ లెక్కల ప్రకారం రాష్ట్ర జిడిపి 128.3 అని, అదే కేంద్రం జిడిపి 89.6 మాత్రమేనని అన్నారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం కూడా పనిచేసి ఉంటే దేశ జిడిపి మరింతమరింత పెరిగేదన్నారు. కేంద్ర విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్లు నష్టపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చేతగాని మోడీ ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు. కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి సర్కారు రావాల్సిన అవసరముందన్నారు.
ఆయన ఏం మాట్లాడారో..ఆ భగవంతుడే తెలియాలి
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నరేంద్రమోడీ ఏం మాట్లాడారో..ఆ భగవంతుడుకే తెలియాలని సిఎం ఎద్దేవా చేశారు. ఆయనది ఆ కథ అయితే మోడీకి ముందు మాట్లాడిన మంత్రులంతా కేవలం తనను తట్టి నోటిదూలను తీర్చుకొని పోయారే తప్ప ఏ విషయంలో ఏం చెప్పినట్లు లేదని విమర్శించారు. దాని తర్వాతనైనా ఏమైనా చెబుతురా అని నాలుగు ఐదురోజులుగా చూశానని అన్నారు. వాస్తానికి అధికార పార్టీ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు అంటే దేశానికి ఏదైనా మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయోనని ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారన్నారు. అలాగే సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతుండడం వల్ల రాష్ట్రానికి కూడా కాస్తో.కూస్తో ప్రయోజనం ఉంటుందని అనుకున్నామన్నారు. కానీ అంతా భబ్రాజమనం. భజగోవిందం, ఉత్తదే డబ్బా కొట్టారని విమర్శించారు.
తాను సంధించిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదు
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా. తాను ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగానని అన్నారు. వాటికి స్పష్టంగా. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా సమాధానాలు చెప్పాలని నిలదీశానని అన్నారు. ముఖ్యంగా మోడీఅవలంభిస్తున్న అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు. కేంద్ర అసమర్థ వల్ల ప్రబలుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలపై మోడీగానీ.కేంద్రమంత్రులుగానీ ఒక్కరూ కూడా సమాధానం చెప్పలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి ఏం కారణం అనుకోవచ్చు? అంటే ఏం లేదన్నారు. సరుకు లేదు. సంగతి లేదు. సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదని విమర్శించారు. అంతా షుష్క ప్రియాలు. శూన్య హస్తాలేనని కెసిఆర్ మండిపడ్డారు. వారి డొల్ల తనాన్ని రుజువు చేసుకొని పోయారన్నారు. దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక అవగాహన వ్యూహం, ఓ దార్శనితక ఏం లేదని కేంద్రం రుజువు చేసుకున్నదని విమర్శించారు.
సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారా?
బిజెపి ధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా దేశం పరువు పోయిందని సిఎం మండిపడ్డారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే.. క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. నుపుర్ శర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు మండిపడితే.. నలుగురు రిటైర్డ్ జడ్జిలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని వారితో లేఖ రాయిస్తారా అని ప్రశ్నించారు. చివరకు బిజెపి నేతలు సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు నడుపుతున్నారా? లేక గుండాయిజం చేస్తున్నారా? అని నిలదీశారు.
అహంకారం పెరిగిపోయింది
బిజెపి ప్రభుత్వానికి అహంకారం బాగా పెరిగిపోయిందని కెసిఆర్ విమర్శించారు. ఆ పార్టీ నాయకులకు కళ్లు నెత్తికెక్కి కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో అన్నామలై అనే తలమాసిన బిజెపి నాయకుడు అక్కడ ఏక్‌నాథ్ షిండే వస్తాడంటూ ఊదరగొడుతున్నాడని విమర్శించారు. తెలంగాణలో కూడా ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఏక్‌నాథ్ షిండే సర్కారు వస్తుందంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం 119అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే టిఆర్‌ఎస్‌కు 103 స్థానాలు ఉన్నాయని.మజ్లిస్ 7 సీట్లును కలుపుకుంటే మొత్తం 110 స్థానాల బలం ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారా? దమ్ముందా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎక్‌నాథ్ షిండే వస్తాడా? అని ఎద్దేవా చేశారు. దేశంలో భీకర కుంభకోణాలు, భయంకరమైన అనారోగ్యకర విధానాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశం బాగుపడాలంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావాలని కెసిఆర్ పేర్కొన్నారు.
కట్టప్పా.. కాకరకాయా?
రాష్ట్రంలో మూడో వంతు మెజార్టీతో టిఆర్‌ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుందని సిఎం కెసిఆర్ తెలిపారు. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్ షిండే వస్తారా? దేశంలో సర్కారు నడుపుతున్నారా? లేక గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. ఏక్‌నాథ్ షిండే వచ్చాక మహారాష్ట్రలో 20 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. కట్టప్పలా.. కాకరకాయా కట్టప్పలు, ఏక్‌నాథ్ షిండే లాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.
మేకిన్ ఇండియా.అట్టర్ ప్లాప్
మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని కెసిఆర్ అన్నారు. దేశానికి అన్ని చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మోడీ పాలనలో తలెత్తిందన్నారు. చివరకు పిల్లలు ఆడుకునే పతంగిల మాంజ, వినాయక చవితి సందర్భంగా తయారు చేస్తున్న బొమ్మలు. దీపావళి సందర్భంగా కాల్చే పటాకులు, చివరకు దేశ పతాకాలు కూడా చైనా నుంచే తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇదా మన ప్రగతి అని కెసిఆర్ మండిపడ్డారు.
రైతుబీమా ఇచ్చే తెలివుందా?
బిజెపి ఎవరిని ఉద్దరించిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి కనీసం ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? అని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్న రైతు చనిపోతే కనీసం పదివేల రూపాయలు ఇస్తరా? అని నిలదీశారు. పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ..తిన్నది అరగక చస్తున్నారంటూ అంటూ తెలితతక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం రైతులు ధర్నా చేస్తే బిజెపి పాలిత రాష్ట్రాల్లో వారిపై వాహనాలను ఎక్కించి. తొక్కి చంపుతున్నారన్నారు. ఇది మీ అహంకారం కాదా? అని ప్రశ్నించారు. రైతులు 13 నెలల పాటు ఢిల్లీ రాజధాని బోర్డర్‌లో ధర్నా చేస్తే ఖలిస్థాన్ ఉగ్రవాదులు అన్న మోడీ. ఎన్నికలు రాగానే మళ్లీ తలవంచి మాఫీ చాతాహు అని క్షమాపణ వేడుకున్నారని ఎద్దేవా చేశారు. మరి వారు ఉగ్రవాదులైతే ఎందుకు క్షమించమని అడిగారని..దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని కెసిఆర్ డిమాంచ్ చేశారు.
మీతోటి ఏమైతది మన్ను..
మోడీకి తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు భయపడరని కెసిఆర్ స్పష్టం చేశారు. మీకు ఎందుకు భయపడతామని ప్రస్నించారు. మీ(కేంద్రం) తోటి ఏమైతది. మన్ను కూడా కాదన్నారు. దొంగలకు భయం. తప్పులు చేసినోళ్లకు భయమన్నారు. అధికారం ఎవరికి కావాలి. కెసిఆర్ ఇలా ఇసిరి.అలా పారేస్తారన్నారు. ప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను మనుగడ సాధించనివ్వకుండా...అప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రొత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎవరిని సహించడం లేదు.ఎవరిని గౌరవవింటడం లేదని మండిపడ్డారు. అసలు దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. అన్నింటా వైఫల్యాలను మోడీ మూటకట్టుకున్నారన్నారు. దేశంలోఉద్యోగ కల్పన లేదు.. నిరుద్యోగం అంతకంతకు పెరుగుతుందన్నారు. ఇక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. మోడీ హయంలో ఇప్పటి వరకు గ్యాస్ ధర 170శాతం పెరిగిందన్నారు. ఏ ప్రధాని ఉన్న సమయంలో లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని వమర్శించారు. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయన్నారు.
ఆయనో నెత్తిలేని సన్యాసి
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై కెసిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనగోయల్ కాదు. గోల్మాల్ మంత్రి అని వ్యాఖ్యానించారు. ఆయనో నెత్తిలేని సన్యాసి అని మండిపడ్డారు. ఎంత దరిద్రంగా మాట్లాడుతడంటే పంటల ఉత్పత్తిలో తెలంగాణ చమత్కారం చేసిందా? అంత పంట ఎలా సాధ్యమైంది? రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో పంటలు ఉన్నదో తెలియదా? అని పిచ్చిపిచ్చిగా మాట్లాడారన్నారు. పంటలు ఎలా పండాయే తెలుసుకునేందుకు రాష్ట్రానికి రావాలని..హెలికాప్టర్లో తిప్పి అధికారులు చూపిస్తామని చెప్పామన్నారు. యాసంగి పంటలో రాష్ట్రంలో కొంత ఉష్ణోగ్రత ఎక్కువైతదిని..దీని వల్ల నూకలు ఎక్కువైతని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా నూకలు తినుండని సొల్లు సలహా ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అంటే ఆయనకు అంత అహంకారమా ?ఇది ప్రజాస్వామ్యమేనా? కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతేనా? అంటూ కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రానికి నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాదు.పంట కొనమంటే అది కూడా చేత కాదన్నారు. మూడు నెలల కిందటనే కదా తాము (టిఆర్‌ఎస్) పోయి ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. రైతులు పంటించిన పంటను కొనుమంటే.. ఎక్కడ పెట్టుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడరని కెసిఆర్ మండిపడ్డారు. ఇప్పుడేమో పీయూష్ గోల్మాల్ వరిని ప్రోత్సహించాలని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం శాశ్వతం అనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. మీరేమైనా పర్మినెంటా? అధికారంలోకి ఎంత మంది రాలేదు? ఎంత మంది పోలేదన్నారు. రావణాసురుడు పోయిండు. దుర్యోధనుడు పోయిండు. కంసుడు పోయిండు. నరకాసురుడు పోయిండన్నారు. అంతకన్న మీరు గొప్పొల్లా' అంటూ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు
కేంద్ర ప్రభుత్వానికి తెలివిలేదని బిజెపి కిసాన్ మోర్చానే చెప్పిందని కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఆ విభాగం కిసాన్ మోర్చా సమావేశంలో మాట్లాడిన వ్యక్తలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారన్నారు. కేంద్రంలో వాణిజ్య శాఖ, వ్యవసాయశాఖకు అసలు సమన్వయమే లేదన్నారన్నారు. ఎప్పుడు ఎగుమతులు బ్యాన్ చేయాలో తెలియని సన్నాసి ప్రభుత్వం మోడీదని మండిపడ్డారు. అలాగే ఎప్పుడు దిగుమతులు బంద్ చేయాలో కూడా తెలియడం లేగదన్నారు. తద్వారా రైతులను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు.

జర్నలిస్టులు ఏమైనా. నక్సలైట్లా?

మోడీ ప్రభుత్వానికి కళ్లు నెత్తికి ఎక్కి ఎవరిని గౌరవించడం లేదని కెసిఆర్ మండిపడ్డారు. హిందూ పత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్, ఎన్‌డిటివికి చెందగిన ప్రణయ్‌రాయ్ ఎక్కడో ఊటిలో సమావేశం పెడితే వారిని నక్సలైట్లు అంటూ ఫొటోలు పెట్టారన్నారు. ఇదెక్కడి అన్యాయమని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. మీరు ఎవరినీ వదలరా? అని నిలదీశారు. చివరకు జర్నలిస్టులు సైతం మీకు నక్సలైట్లు లాగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. మీ ఉన్మాదం, పిచ్చి ఎక్కడి వరకు వెలుతుందన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటదని కెసిఆర్ అన్నారు.
CM KCR Slams BJP Party and PM Modi