తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్
తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్
వారం రోజుల్లో జీవో విడుదల చేస్తాం
దళిత బంధు తరహాలో...
గిరిజన నిరుపేదలకు గిరిజన బంధు
ఆదివాసీ , బంజారా ఆత్మీయ సభలో
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
అత్యంత వైభవంగా ఆదివాసీ,
బంజారా భవనాల ప్రారంభం
ఒక్క పొరపాటు చేసి
58 ఏళ్ళు గోసపడ్డం
ప్రజలందరూ విద్వేష శక్తుల పట్ల
అత్యంత అప్రమత్తంగా ఉండాలి
• ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సమస్త గిరిజన, ఆదివాసీ జాతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
• గిరిజనులను, ఆదివాసీల కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ లో రూ.60 కోట్ల ఖర్చులతో కుమ్రం భీం ఆదివాసీ, సేవాలాల్ బంజారా భవన్లను ప్రారంభించుకున్నాం.
• చాలామంది గిరిజన ఉద్యోగులు, మేధావులు, కవులు, రచయితలు ఉన్నారు.
• గిరిజన సమస్యల గురించి వారు మాట్లాడారు.
• ఇవన్నీ పరిష్కారం అయ్యేందుకు ఆదివాసీ, బంజారా భవన్లు వేదికలు కావాలి.
• ఈ చర్చల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆదివాసీ, గిరిజన మేధావి వర్గాన్ని కోరుతున్నాను.
• చాలా సమస్యలు ఉన్నాయి. వాలటన్నింటి పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలి.
• ఆ వేదికలను ఉపయోగించుకొని, మేధోమథనం చేయాలి.
• దేశంలో కేంద్ర పాలకులు విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నారు.
• తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా, పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.
• తెలంగాణకు వచ్చే న్యాయమైన హక్కులపైనే కేంద్రాన్ని అడుగుతున్నాం.
• ఈ దేశంలో 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా?
• మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? ఎందుకు హక్కులు ఇవ్వడం లేదు. అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు.
• పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ప్రజల ఆస్తులను ఉచితంగా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు.
• సంకుచితమైన పెడధోరణితో వ్యవహరిస్తున్నారు.
• ఒకడు మతం పేరుతో.. మరొకడు కులం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు సృష్టిస్తున్నరు.
• అలాంటి విద్వేషాలకు మనం తావు ఇవ్వొద్దు.
• అనేక కష్టాలు, నష్టాలకొర్చి, ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న తెలంగాణ మరో కల్లోల్లానికి గురి కావొద్దు.
• తెలంగాణ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి.
• తెలంగాణ కోసం కులం మతం లేకుండా అందరం కలిసి 58 ఏండ్లు కొట్లాడినం. రాష్ట్రం తెచ్చుకున్నం.
• ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన జనాభా 6శాతంగా ఉంటే, గిరిజన జాతి 5శాతం మాత్రమే రిజర్వేషన్ పొందింది.
• కానీ, తెలంగాణలో జనాభా ప్రాతిపదికన చూస్తే వారి సంఖ్య పెరిగింది.
• ఎస్టీలకు 10శాతానికి రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినం.
• ఈ వేదిక నుంచి అడుగుతున్నా.. మీరెందుకు ఆమోదించరు ప్రధాని మోడీ గారూ.,
• మీకు చేతులు జోడించి అడుగుతున్నా.. మా గిరిజన బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపండి.
• రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ బిడ్డే ఉన్నరు కాబట్టి ఈ బిల్లును ఆపరు.
• మా ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతూ అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నా.. (సభలో చప్పట్లు)
• ఇక్కడికి వచ్చి విభజన, విద్వేష రాజకీయాలు చేస్తున్న అమిత్ షా గారూ, ప్రధాని మోడీ గారు ఈ విషయంపై సమాధానం చెప్పాలె.
• గిరిజన సోదరుల కోసం తండాలను పంచాయతీలుగా చేశాం.
• తండాలు, ఆదివాసీ గూడెంలలో వారే పరిపాలించుకుంటున్నారు.
• మూడు ఫేజుల కరెంట్ ఇస్తున్నాం. గురుకులాలను ఏర్పాటు చేశాం.
• రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం.
• మిషన్ భగీరథ ద్వారా తండాలకు, గూడెంలకు మంచినీరు అందిస్తున్నాం.
• బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇచ్చే నీళ్లే.. ఆదిలాబాద్ గూడెల్లో, అచ్చంపేట చెంచు గూడాల్లో కూడా అందిస్తున్నాం.
• తండాల్లో విషజ్వరాలు లేవు. ఆకలి చావులు లేవు. కడుపు నిండా అన్నం పెడుతున్నాం. అన్ని పథకాలు అందుతున్నాయి.
• అమాయకులైన గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఇవ్వడానికి భూములను గుర్తించాం.
• పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కమిటీలు వేసుకునేందుకు ఈ మధ్యే 140 నంబరు జీవో కూడా ఇచ్చాం.
• త్వరలోనే ఈ కమిటీలు సమావేశమై నివేదికలిస్తే... పోడు భూములకు పట్టాలిస్తం. రైతుబంధు కూడా ఇస్తం.
• ఈ దేశంలో 8 సంవత్సరాల్లో ఏ వర్గానికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచిపనైనా చేసిందా?
• ఏమీ చేయలేదు. న్యాయమైన, ధర్మమైన హక్కులను కూడా ఇవ్వడం లేదు.
• ఎన్.పి.ఏ.ల పేరుతో... లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దోచిపెడుతున్నరు.
• మనం అనేక కష్టాలు, నష్టాలకోర్చి తెచ్చుకున్న తెలంగాణ మరోసారి కల్లోలానికి గురికావద్దు.
• ఇంతకుముందే మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చి, సార్ మీ జాతీయ పార్టీకి మేం మద్దతిస్తం. మీరు ముందుకు పొండి అని కోరారు.
• మావా నాటే, మావా రాజ్ అని దశాబ్దాలుగా గిరిజన సోదరులు కోరారు.
• మేం ఎన్నికల్లో చెప్పిన విధంగా 3 వేల పైచిలుకు
• గిరిజనులను ఎన్నో ప్రభుత్వ పథకాలతో ప్రోత్సహిస్తున్నం..
• ఎక్కడో అచ్చంపేటలో కొండల్లో ఉన్న చెంచులతోపాటు, ఆదిలాబాద్ లో ఉన్న ఆదివాసీలకు
• గిరిజనులకు పెన్షన్లు అందించుకుంటున్నం.
• గిరిజనుల సంస్కృతిని కాపాడుకుంటున్నం. గిరిజన పండుగలు, జాతరలను ప్రభుత్వమే వందల కోట్లతో నిర్వహిస్తున్నది.
• స్వరాష్ట్రం వచ్చింది కాబట్టే ఇవన్నీ చేసుకుంటున్నం.
• గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని అడిగి, అడిగి విసిగిపోయినం
• మా గిరిజన బిడ్డల రిజర్వేషన్ సంగతి మేమే చూసుకుంటం.
• రాబోయే వారం రోజుల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేసుకుంటం.
• ప్రధాని నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తవా? లేదా దాన్నే ఉరితాడు చేసుకుంటవా?
• ఈ దేశంలో సరిపడా నీళ్లు, ఇతర వనరులున్నయి. ఇవ్వాలంటే సరిపడా కరెంటు ఇవ్వొచ్చు.
• ఏడేండ్ల కింద మన కరంటు బతుకు ఎట్లుండె? కరంటు ఎపుడస్తదో ఎపుడు పోతదో ఆ భగవంతునికే తెలిసే పరిస్థితి.
• ఇవాళ మన కష్టపడ్డం. కరంటు దుస్థితిని బాగు చేసుకున్నం.
• కానీ, కేంద్రం మన కరంటును చూసి, మనల్ని బతకనీయకుండా ప్రతి బోరుకు మీటరు పెట్టాలె అంటున్నది.
• ముక్కు పిండి రైతుల దగ్గర పైసలు వసూలు చేయాలె అంటున్నడు నరేంద్ర మోడీ.
• రైతులారా.. చెప్పండి మీ బాయిల కాడ బోర్లకు మీటర్లు పెట్టాల్నా?
( మీటర్లు పెట్టకూడదని సభలో సమాధానం)
• ఇట్లనే అనేక సులభమైన విషయాలను కూడా కేంద్రం పరిష్కరించకుండా తాత్సరం చేస్తున్నది.
• తమకు ఇష్టమైన కోటీశ్వరులకు , ఇండస్ట్రియలిస్టులకు, షావుకార్లకు ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల దేశ సంపదను దోచిపెడుతున్నది.
• ఈ దుర్మార్గం అంతా పోవాలె. ప్రజా రాజ్యం రావాలె. రైతుల రాజ్యం రావాలె.
• ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలె.
• ఈ దేశం నదుల్లో ప్రవహించే నీళ్లు సముద్రం పాలు కాకుండా, రైతుల పంట పొలాలకు రావాలె.
• తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశం అంతా జరగాలె.
• జరగాల్నంటే ఖచ్చితంగా తెలంగాణ జాతిగా మనం కూడా భారత రాజకీయాలను ప్రభావితం చెయ్యాలె. ముందడుగు వెయ్యాలె.
• తెలంగాణ కోసం పోరాటం చేసినట్లే.. ఈ మత పిచ్చి, విద్వేష రాజకీయాలను బద్దలు కొట్టాలె.
• మహత్ముడు సాధించిన ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ముందుకు పోవాలె. అది పౌరులుగా మన కర్తవ్యం.
• నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న
• ఒక చిన్న పొరపాటు జరిగితే 58 ఏండ్లు ఎంత గోస పడ్డం. ఎంత బాధ పడ్డం.
• తాగు నీళ్లకు, సాగునీళ్లకు, కరెంటుకు, ఉద్యోగానికి వలసలు పోయినం.
• 20 ఎకరాలు, 30 ఎకరాలున్న రైతు కూడా హైదరాబాదుకు వచ్చి ఆటో నడిపించే స్థాయికి దిగజారి పోయినం.
• తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పిన.
• ఈ సమైక్య రాష్ట్రంలో మా తెలంగాణ బతుకు.. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిగా మారిందన్న.. రాష్ట్రమొస్తే బాగుపడుతమని చెప్పిన.
• కొట్లాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. కొద్దిగ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నం.
• స్వరాష్ట్రంలో కడుపునిండా అన్నంపెట్టుకుంటా ఉన్నం.
• కల్యాణలక్ష్మి గానీ, ఇతర ప్రభుత్వ పథకాలు గానీ సమాజంలో అందరికీ అందించినట్లుగానే గిరిజన బిడ్డలకూ అందించుకుంటున్నం.
• ప్రత్యేక భాష, సంస్కృతి, జీవన శైలి ఉన్న గిరిజనుల సంస్కృతిని కాపాడుకుంటున్నం.
• ఇపుడు గర్వంగా ఉన్నది. గురుకులాల్లో చదివిన 200 మంది అద్భుతమైన ప్రతిభ చూపి, డాక్టర్లు ఇతర గొప్ప చదువులల్లో ఉన్నరు.
• వారంతా చేతులూపుతూ గ్రీట్ చేస్తున్నరు.
• మా చీఫ్ సెక్రటరీ గారు పిలుపిస్తే.. గిరిజన గురుకుల విద్యార్థులు బ్రహ్మాండంగా కేరింతలు కొట్టిండ్లు.
• అందుకే ఈ సంవత్సరమే మరిన్ని గురుకులాలను పెంచుతం
• గిరిజన గురుకులాల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఎంతైనా ఖర్చు పెడతం.
• మీరు ఈ జాతి గర్వించే విధంగా బంగారు బిడ్డలుగా ఎదగాలె.
• గిరిజన ఆడబిడ్డలు కూడా బాగా చదువుకోవాలె
• గిరిజన విద్యావంతులైన బిడ్డలు ఎక్కడున్నరంటే.. తెలంగాణలోనే అని చెప్పాలె.
• తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారింది.
• సంపద పెంచడం, పేదలకు పంచడమే మన సిద్ధాంతం.
• తెలంగాణలో దళిత బంధు పథకంతో ఎట్లాగైతే ఇంటికి 10 లక్షల రూపాయలిచ్చి ఆదుకుంటున్నమో.... పేద గిరిజనులకు కూడా గిరిజన బంధు అమలు చేస్తాం
• పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే, గిరిజన బంధుపై ఆలోచన చేస్తం.
• ఎట్టి పరిస్థితుల్లోనూ విద్వేషకర శక్తులకు తావివ్వవద్దు.
• అభివృద్ధితో అలరారే తెలంగాణను ఆగం చేయవద్దు.
• ఈ దేశంలోని పీడిత, తాడిత ప్రజల బతుకులు బాగు చేసేందుకు.. నా చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తాను.
ఆదివాసీ , బంజారా భవనాల ప్రారంభం
-----------------------------------
భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేళ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభమైన మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ పౌరులైన మెజారిటీ ప్రజలను నేటివరకు తమమీద ఆధారపడేలా చేస్తూ వస్తున్న పాలక వర్గాలకు గుణపాఠం నేర్పేవిధంగా గత పాలకులకు భిన్నంగా ఎన్నో ఆదర్శవంతమైన ‘ఇంక్లూజివ్’ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మారిజినల్ సెక్షన్లుగా పిలువబడుతున్న దళిత బహుజన భారత శూద్ర జాతి ని మందిలో కలుపుతున్న సువర్ణాధ్యాయం వొకటి వర్తమాన తెలంగాణ రాజకీయ పాలనారంగ యవనిక మీద లిఖించబడుతున్నది.
తెలంగాణలో గిరిజన బిడ్డలైన ఆదివాసీలు, బంజారాల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల ఖర్చుతో ఆదివాసీ వీరుడు కొమురం భీం పేరుతో నిర్మించిన ఆదివాసీ భవన్ ను, సేవాలాల్ మహరాజ్ పేరుతో నిర్మించిన బంజారా భవన్ లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇన్నేండ్లకు ఖరీదైన బంజారా హిల్స్ ’ లో నిర్మితమైన తమ ఆత్మగౌరవ భవనాలను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్ కు హర్షాతిరేకాలతో చప్పట్లతో కేరింతలతో జై కెసిఆర్ నినాదాలతో తమ కృతజ్జతలను చాటుకున్నారు.
ఈ సందర్భంగా.. ఆదివాసి బంజారా జంట భవనాలవద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు బంజారా సాంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ భవన్ కు చేరుకున్న సిఎం కెసిఆర్ అక్కడ సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేశారు. అనంతరం ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు. భవనంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ గోండు వీరునికి, తెలంగాణ సాయుధ పోరాట స్వాతంత్ర్య సమరయోధునికి జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేళ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సోదరులు తాము సంప్రదాయంగా ధరించే తలపాగాను సీఎం కేసీఆర్ కు ధరించారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీ, బంజారాల ఆనందోత్సాహాల మధ్య సీఎం కేసీఆర్ ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆదివాసీ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. అనంతరం...జంట భవనాలలోని బంజారా భవన్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహించారు. మద్దిమడుగు సంత్ సేవాలాల్ పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో బంజారా సాంప్రదాయ ‘భోగు బండారి’ పూజలు జరిపారు.
అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు. ‘యాడీ బాపు రామ్ రామ్ ’ అంటూ సిఎం కెసిఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సదర్భంగా సభలోంచి హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఈ రెండు భవనాల ఆవిష్కరణోత్సవ సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ... ‘‘ ఎస్టీ సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనాలకు తండోపతండాలుగా విచ్చేసిన ఆదివాసీ, బంజారా బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇది భారతదేశ గిరిజన జాతి బిడ్డలకు స్ఫూర్తి కి కలిగించే సందర్భం. ఉద్యమ సమయంలో నేను ఎన్నోసార్లు చెప్పిన. మన రాజధానిలో బంజారా హిల్స్ అని ప్రాంతం ఉంటది.. కానీ, అక్కడ బంజారాలకే గజం జాగ లేదని చెప్పిన. ఆ మాటను తిరగరాస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తం తెలిసేలా చేసుకుంటున్నం,. చాలా సంతోషంగా మనం ఆదివాసీ బంజారా భవనాలను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ స్ఫూర్తి..’ అని అన్నారు.
గిరిజన జాతి నుంచి పైకెదిగిన ఉద్యోగులు నాయకులు మేధావులకు వారి భవిష్యత్తు తరాలను ముందు వరసలో నడిపే బాధ్యత వున్నదని సిఎం అభిప్రాయ పడ్డారు. ‘‘ కేవలం భవనాలను నిర్మించుకోవడమే కాదు. వాటిని సద్వినియోగం చేసుకునే దిశంగా గిరిజన మేధావి వర్గం ఉద్యోగులు ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర నీటిపారుదలశాఖలో పనిచేసే హరిరామ్ లాంటి అనేకమంది బంజారా బిడ్డలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. వారికి నా అభినందనలు.’’ అని సిఎం అన్నారు.
‘‘ ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటన్నింటినీ వేర్వేరు చోట్ల వేర్వేరుగా మాట్లాడుకుంటారు. కానీ, గిరిజన భాషను మాత్రం ప్రపంచమంతటా ఒకేవిధంగా మాట్లాడుకుంటారు. ఇదొక గొప్ప విషయం. గిరిజన బిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటే, మహారాష్ట్రలో బీసీలుగా, మరోచోట ఓసీలుగా ఉన్నారు. వీరందరినీ సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి మేం చెప్పడం జరిగింది. అలాగే, రాష్ట్రంలో పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించుకునేందుకు ఇటీవలే కమిటీలు కూడా వేసుకోవాలని జీవో ఇచ్చినం. మీరందరూ పోడు భూముల సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలి.’’ అని సీఎం కేసీఆర్ గిరిజనులకు పిలుపునిచ్చారు.
అదేవిధంగా సభలో పాల్గొన్న, అధికారులు, బంజారా మేధావులందరూ గిరిజన గూడేల్లో నివసిస్తున్న నిరుపేదల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచి ఆలోచనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా గిరిజనులంటే అభిమానం ఉన్న వ్యక్తేనని, వారు కూడా సర్వీసులో మొట్టమొదట ఐటీడీఏలో పనిచేశారని, గిరిజన సమస్యలన్నీ తెలిసిన సీఎస్ గారి సహకారం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ , బంజారాలు పలువురిని సీఎం ఘనంగా సత్కరించారు. ఆదివాసీ, బంజారా భవన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో... మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, మాలోతు కవితా నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి. తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పీ.వీ.వాణీదేవి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, దానం నాగేందర్, రేఖా నాయక్, శంకర్ నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు, రవీంద్రకుమార్ నాయక్, ఎ.జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు రాంచంద్ర నాయక్, వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అనిల్ కూర్మాచలం, ఆర్.టి.ఐ కమిషనర్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ క్రిస్టినా చొంగ్తు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కరాటే రాజు, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.