తెలంగాణలో కాంతి రేఖలు

తెలంగాణను అంధత్వరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంతో తెలంగాణలో కాంతిరేఖలు విస్తరిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఊరూరా కంటి వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటినుంచి ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కంటి వైద్యశిబిరాల్లో 521 గ్రామాలు, 86వార్డుల్లోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 7,16,621 మందికి పరీక్షలు చేశారు. 1,33,436 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,15,091 మందికి నేత్రపరీక్షలు నిర్వహించారు. 20,060 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. ప్రత్యేక కంటి సమస్యలున్నవారు 27155 మందికి అద్దాల కోసం సూచించారు. 9,425 మందికి కాటరాక్ట్ ప్రతిపాదించగా..643 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం కంటిపరీక్షలు నిర్వహించిన 1,15,091మందిలో 41013 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యబృందాలు నిర్ధారించాయి.
శిబిరాలను సందర్శించిన కమిషనర్ కరుణ
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ పట్టణంలోని భాగ్యనగర్, రాజీవ్‌నగర్‌లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ శుక్రవారం సందర్శించారు. వైద్యసేవలు అందుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోజుకు వైద్యులు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందిని రెఫర్ చేస్తున్నారని అడిగారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఆమెవెంట జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శశాంక్ ఉన్నారు.

దరలో పరీక్షలపై శాంతికుమారి ఆరా
అమ్రాబాద్ రూరల్: కంటి వెలుగు పథకానికి అమలుతీరును పరిశీలించేందుకు శుక్రవారం వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి పదర మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యకేంద్రం వద్ద కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కంటిపరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి పరీక్షలపై ఆరాతీశారు. వైద్యాధికారులు కంటిపరీక్షలు సక్రమంగా చేస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? వైద్యులు ఓపికతో అన్ని పరీక్షలు చేస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. ప్రభుత్వం మంచిఉద్దేశంతో కంటి వెలుగు పథకానికి అంకురార్పణ చేసిందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌లాల్, కంటి వెలుగు కో డైరెక్టర్ మీరాకుమారి, డాక్టర్ బిక్కు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.