తల్లడిల్లుతున్న యువహృదయాలు

యుక్తవయసులోనే విరుచుకు పడుతున్న గుండె జబ్బులు
జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణమంటున్న నిపుణులు
ఇంట్లో కుటుంబ సభ్యులతో భోజనం చేస్తున్న సమయంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుమారుడు ఉన్నట్టుండి తీవ్రమైన గుండెపోటుకు గురై మృతిచెందడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ‘సడెన్‌ కార్డియాక్‌ అరెస్టు’పై పడింది. కొన్ని నెలల కిందటే సరిగ్గా ఇలాంటిదే జూబ్లీహిల్స్‌లో జరిగింది. అక్కడి మైదానంలో కొందరు మిత్రులు క్రికెట్‌ ఆడుతుండగా.. బౌలింగ్‌ చేస్తూ ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల గాంధీ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌, పీజీ చేస్తున్న కొందరు యువ వైద్యులు కూడా గుండెజబ్బు బారినపడ్డారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ చోటుచేసుకుంటున్నాయి.
* ఆరోగ్యశ్రీ గణాంకాల ప్రకారం.. 2008-09 నుంచి 2016-17 వరకూ గత ఎనిమిదేళ్లలో గుండెజబ్బు చికిత్సలు దాదాపు 105 శాతం పెరగ్గా.. ఇందులో అత్యధిక కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయి. మొత్తం 2.20 లక్షల గుండెజబ్బు చికిత్సలు నమోదవగా.. ఇందులో 15-35 మధ్యవయస్కులకందించిన చికిత్సల సంఖ్య 29811 (13.52శాతం)గా నమోదైంది. 15-45 ఏళ్ల మధ్యవయస్కుల్లో గుండెజబ్బు చికిత్సలను పరిగణనలోకి తీసుకుంటే 73028 (33.12శాతం)గా గుర్తించారు.
* ‘జీవీకే ఈఎంఆర్‌ఐ’ (అత్యవసర వైద్యసేవల నిర్వహణ, పరిశోధన సంస్థ) 2016 జనవరి నుంచి డిసెంబరు వరకూ అత్యవసర వాహన(108) సేవల్ని విశ్లేషించింది. ఇందులోనూ గుండెజబ్బు బారినపడిన మొత్తం 12021 మందిని అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించగా.. వీరిలోనూ 15-34 ఏళ్ల మధ్యవయస్కులు 2378 (19.78శాతం) మంది కావడం గమనార్హం.
* ‘హఠాత్తుగా గుండె ఆగిపోవడం’పైనా ఈఎంఆర్‌ఐ 2016 డిసెంబరు నుంచి 2017 ఏప్రిల్‌ వరకూ తెలంగాణలో ప్రత్యేకంగా పరిశోధన చేసింది. ఈ 5 నెలల్లో మొత్తం 493 మందిలో ఇలా గుండె ఆగిపోవడం జరగ్గా.. వీరిలో 74 శాతం (367 మంది) మృత్యువాతపడ్డారు.
* సాధారణంగా 60 ఏళ్ల పైబడినవారిలో కనిపించే గుండెజబ్బులు.. 35 ఏళ్ల లోపే ఎదురవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగానే యుక్తవయస్సులో గుండెజబ్బులు ఎదురవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడం, జంకు ఫుడ్‌ పెరిగిపోవడం.. ఒత్తిడి అధికవడం.. ఫలితంగా పాతికేళ్లలోపే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశమేంటంటే.. ఎక్కువమందిలో తమకు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయనే విషయం కూడా తెలియకపోవడం.
వీరు అప్రమత్తంగా ఉండాలి..
* మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు
* ధూమపానం చేసేవారు
* స్థూలకాయులు
* అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు
* ఒత్తిడిని నిత్యం ఎదుర్కొనేవారు
* శారీరక శ్రమకు దూరంగా ఉండేవారు
* కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు ఇలాంటి వారు 30 ఏళ్ల వయస్సులోనూ ఏడాదికి ఒకసారైనా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

లక్షణాలను గుర్తించడమెలా?
* ఛాతీ మధ్య, పైభాగంలో నొప్పి – ఛాతీ నుంచి ఎడమ, కుడిచేతి, గొంతు వైపునకు నొప్పి వ్యాపించడం
* చెమటలు పట్టడం – ఆయాసం – ఛాతీ పట్టేసినట్లుగా బరువుగా ఉండడం. అప్పటి వరకూ ఎలాంటి సమస్యలు లేని యువతలో ఉన్నట్టుండి ఈ లక్షణాలు కనిపిస్తే అత్యవసరంగా వైద్యున్ని సంప్రదించాల్సిందే.

హఠాత్తుగా గుండె ఆగిపోవడం..
* ప్రధాన కారణాల్లో కీలకమైంది. వేర్వేరు రకాల కార్డియోమయోపతి. అంటే.. గుండె కండరాలు బలహీనపడడం, గుండె కండరాలు మందంగా మారడం.
* ఈఎంఆర్‌ఐ చేసిన పరిశోధనల ప్రకారం.. మొత్తం కేసుల్లో 54 శాతం మంది ఇంటి వద్దే కుప్పకూలిపోగా, 26 శాతం మంది వీధులు, జాతీయ రహదారులపై కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు.
* ఈ జాబితాలో 22 శాతం మంది 60-69 ఏళ్ల వయసు వారుండగా, 50-59 ఏళ్ల వయస్కులు 16 శాతం మంది ఉన్నారు. వీరిలో పురుషులు 69 శాతం మందికాగా, మహిళలు 31 శాతం.
* హఠాత్తుగా గుండె ఆగిపోయినవారిలో 37 శాతం మంది ఇంతకు ముందే గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతుండగా, ఊపిరితిత్తుల సమస్యలతో 34.9 శాతం మంది ఉన్నారు.

తొలి గంటే కీలకం
ఇరవై రెండేళ్ల వయసున్న 12 మంది యువకులకు ఇటీవల కాలంలో స్టెంట్లు పెట్టాను. ఎక్కువమంది ధూమపానం, జంకుఫుడ్‌ తినే అలవాట్లున్నవారే. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, చిప్స్‌, కేకులు వంటివాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫలితంగా యుక్తవయసులోకి అడుగుపెట్టేసరికే స్థూలకాయం వచ్చేస్తోంది. ఆ తర్వాత మధుమేహం, అధిక రక్తపోటు వంటివి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. యుక్తవయసులో వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా వస్తుంది. తొలిగంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితాలుంటాయి. అసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు.