తక్షణమే ఇల్లు ఖాళీ చేయండి… చంద్రబాబు నివాసానికి నోటీసు అంటించిన ఉండవల్లి వీఆర్వో

  • వరదనీటితో పోటెత్తుతున్న కృష్ణానది
  • ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన వీఆర్వో
  • ఎవరూ లేకపోవడంతో.. గోడకు నోటీసును అతికించిన వైనం

కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరదనీరు పోటెత్తుతుండటంతో… విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దిగువన ఉన్న పలు గ్రామాలు నీట మునగడమే కాక, వాటికి రాకపోకలు కూడా స్తంభించాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తక్షణమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చేందుకు అక్కడకు వెళ్లారు. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడంతో… ఇంటి గోడకు నోటీసును అతికించి వచ్చారు. ఈ సందర్భంగా వీఆర్వో మాట్లాడుతూ, ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.