ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఫలితాల సరళి కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఆమ్ ఆద్మీపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీపార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు విజయోత్సాహంతో కనిపిస్తోంది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు ఆప్ నేతలు ముందంజలో ఉండటంతో కార్యకర్తలు విజయసంకేతం చూపిస్తూ మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ కి 53 సీట్లు, బీజేపీకి 16 సీట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆప్ కి 14 స్థానాలు తగ్గాయి. బీజేపీకి 13 స్థానాలు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మిగతా పార్టీలకు నిరాశే మిగిలింది. సీఎం  కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకొని విజయ నినాదాలు చేశారు. ఆప్ నేతలంతా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎగ్జిట్స్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతుండగా, మరోవైపు బీజేపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లను గెలుచుకుని అమోఘ విజయం సాధించింది.2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్‌లో ఈ పార్టీకి కేవలం రెండు సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. కానీ ఈసారి 1 సీటు వచ్చేలా వుందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియడంతో 38 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ 16 స్థానాల్లో ఆధిక్యం కనబరిచాయి.