టీడీపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించండి: గవర్నర్ ను కలిసి విన్నవించిన బీజేపీ నేతలు

  • మూడు అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదు
  • 40 నిమిషాల పాటు గవర్నర్ తో చర్చ
  • పీడీ అకౌంట్లపై యనమల సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారన్న జీవీఎల్

విజయవాడలోని గేట్ వే అతిథి గృహంలో ఉన్న గవర్నర్ నరసింహన్ ను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు తదితరులతో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పాలనకు సంబంధించిన మూడు అంశాలపై గవర్నర్ కు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా 54 వేల పీడీ అకౌంట్లను తెరిచి, భారీ ఎత్తున నిధులను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. అమరావతి బాండ్ల పేరిట నిధుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు.

గవర్నర్ తో సమావేశానంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, పీడీ అకౌంట్ల వ్యవహారంపై అకౌంటెంట్ జనరల్ నుంచి వివరణ కోరినట్టు గవర్నర్ తమకు తెలిపారని చెప్పారు. మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని, ఈ అంశాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. పీడీ అకౌంట్లపై ఆర్థిక మంత్రి యనమల సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎక్కువ అప్పులు తెచ్చుకుని, ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.