టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు బిగిసిన ఉచ్చు}

  • పరారీలో చింతమనేని – కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు

కులం పేరుతో దూషించాడనే ఆరోపనపై తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. చింతమనేని తనను కులం పేరుతో దూషించాడనీ, దాడికి పాల్పడ్డాడని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ముందుజాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జోసెఫ్ ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు గాలింపును ముమ్మరం చేశారు. దుగ్గిరాలలోని చింతమనేని నివాసంతో పాటు ఏలూరు కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మఫ్టీలో మోహరించారు. అలాగే ఏలూరులో   టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలోపోలీసులు మఫ్టీలో అక్కడికి   చేరుకున్నారు. చింతమనేని ప్రభాకర్ బెయిల్ కోసం బయటకు వస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు.  ఏ క్షణంలో అయినా చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.