టీడీపీకి మంత్రి బొత్స కౌంటర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన తుగ్లక్ 2.0లా సాగిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేశ్ విమర్శలను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పికొట్టారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని పారిపోయి వచ్చినవాడే అసలైన తుగ్లక్ అని బొత్స విమర్శించారు. అలా పారిపోయింది లోకేశ్ తండ్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. దిగవంత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోకూడదని పోరాడారనీ, అదే సమయంలో లోకేశ్ నాయన మాత్రం ‘రాష్ట్ర విభజనకు మేం సుముఖం’ అని పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

‘రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చినవాడు తుగ్లక్ అవుతాడా? లేక జగన్ తుగ్లక్ అవుతాడా? తుగ్లక్ అని మాట్లాడుతున్న వ్యక్తికి దాని అర్థం తెలుసా? ఏదో ట్విట్టర్ లో వచ్చి రెండు వ్యాఖ్యలు టైప్ చేసేసి నేనేదో మేధావిని అని అనుకుంటే ఎలా? మా ప్రభుత్వం చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నాం. సమయం నిర్దేశించుకుని హమీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. గతంలో చంద్రబాబు పాలనంతా అభూత కల్పనలా సాగింది.

నాయకుడు ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలో జగన్ చేసి చూపిస్తున్నారు. ఉద్ధానంలో అనేకమంది కిడ్నీ బాధితులు ఉన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో వారిని పట్టించుకున్నారా? ఈరోజున జగన్ 200 పడకల ఆసుపత్రిని శంకుస్థాప చేశాడు. ఇది కమిట్ మెంట్ కాదా? త్వరలోనే ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది అఛీవ్ మెంట్ కాదా? ఇది నువ్వు(చంద్రబాబు) ఎందుకు చేయలేకపోయావ్’ అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అకృత్యాలు జరిగాయి కాబట్టి తామూ చేయాలని కోరుకోవడం లేదని బొత్స స్పష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Tags: Andhra Pradesh, Nara Lokesh, Chandrababu, Telugudesam, YSRCP, BotsaCounter