టీఆర్ఎస్ లో చేరుతున్న కారణమిదే: రేగా, ఆత్రం

తాము కేవలం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులు వెల్లడించారు. తమను ఎవరూ ప్రలోభపెట్టలేదని వ్యాఖ్యానించిన వారు, గిరిజనులు, ఆదివాసీల కోసం తాము పార్టీ మారుతున్నామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచే సత్తా తమకుందని అన్నారు.

ఈ మేరకు పత్రికలకు ఓ లేఖను విడుదల చేసిన వారు, తాము సీఎం కేసీఆర్ ను కలిశామని, ఎస్టీలు, ఆదివాసీల సమస్యలను ఆయన ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. పోడు భూముల సమస్యలు, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, గిరిజన, ఆదివాసీలను ఉపాధి కల్పించాలని కోరగా, ఆయన స్పష్టమైన హామీలు ఇచ్చారని చెప్పారు. అధికారులతో వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఇండియాలో మరెక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో సాకారమైందని, అందుకు కేసీఆరే కారణమని పొగడ్తలు కురిపించారు.