టీఆర్ఎస్ కు రాజీనామా… నాలుగేళ్లు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు: కేసీఆర్ పై కొండా సురేఖ నిప్పులు

కేసీఆర్ ను టార్గెట్ చేసిన కొండా సురేఖ
టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయింది
కేటీఆర్ కోసం సీనియర్లను అణచి వేస్తున్న కేసీఆర్
ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారని విమర్శలు
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. తాను నాలుగు సంవత్సరాల పాటు ప్రయత్నించినా, కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆమె, టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని అన్నారు. వరంగల్ వచ్చి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసిన వేళ కూడా తనను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపలేదని తెలిపారు.

కేటీఆర్ ను సీఎంను చేయాలని అనుకుంటున్న కేసీఆర్, ఎంతో మంది సీనియర్ నాయకులను అణచి వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తాను అడిగిన ఎన్నో ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానాలు రాలేదని చెప్పారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా ఆమె విడుదల చేశారు.

ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్ పాతరేశారని, కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఓ బీసీ మహిళగా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, కేసీఆర్ తన దొరతనాన్ని చూపించారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని ఆమె వెల్లడించారు.