టీఆర్ఎస్‌తో అమీతుమీ.. తిరిగి కాంగ్రెస్‌లోకి డీఎస్?

టీఆర్ఎస్‌లో చేరి అవమానాల పాలవుతున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన తనను సస్పెండ్ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సస్పెండ్ చేయకుంటే కనుక అధిష్ఠానంపై మాటల యుద్ధానికి దిగడం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఓ వెలుగు వెలిగిన డీఎస్ 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే, డీఎస్ ఇద్దరు కుమారుల్లో ఒకరు బీజేపీలో చేరడం, మరో కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో నెమ్మదిగా విభేదాలు మొదలయ్యాయి. దీనికితోడు డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి ఆ ప్రతిని సీఎం కేసీఆర్‌కు పంపడంతో అవి మరింత ముదిరాయి.

స్థానిక ప్రజాప్రతినిధులు పంపిన తీర్మానంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, తనను పిలిచి వివరణ అడగకపోవడంతో డీఎస్ కినుక వహించారు. పార్టీలో తనకు విలువ లేకుండా పోయిందని గుర్తించారు. ఈ క్రమంలో పార్టీతో అమీతుమీకి సిద్ధమయ్యారు. అధిష్ఠానానికి రెండు పేజీల లేఖ రాశారు. తనంతట తానుగా రాజీనామా చేయబోనని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ వెల్లడించారు. మరో వారం రోజులు వేచి చూసి అప్పటికీ తనను సస్పెండ్ చేయకపోతే పార్టీ మారాలని డీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన అనుచరులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.