చీకటి -వెలుగు – దీపావళి

Throw some light – (త్రో సమ్ లైట్ ) అని ఇంగ్లీషులో ఒక నుడికారం . ఒక విషయం మీద లోతుగా దృష్టి పెట్టాల్సినపుడు వాడుతున్న మాట . దీనితో సమానమయిన నుడికారం మన తెలుగులో లేదు . ఒక్కో భాషకు కొన్ని సొంతం .

ఇపుడు సైన్సులోకి వెళదాం . వెలుతురు లేకపోవడమే చీకటి . చీకటికి విడిగా ఉనికి లేదు . ప్రపంచంలో ఏ వస్తువు మీద అయినా వెలుగు పడితే అది మన కంట్లో పడుతుంది . లేకపోతే వస్తువు అక్కడే ఉంటుంది – చీకటి వల్ల మనకు కనబడదు .

దైవికంలోకి వద్దాం –
పగలు – రాత్రి కాలం . పగటికి సూర్యుడు ఆధారం , రాత్రికి చంద్రుడు ఆధారం . విరాట్ పురుషుడి రెండు కళ్లు సూర్య చంద్రులు అంటోంది విష్ణు సహస్రనామం – చంద్ర సూర్య అవుచ నేత్రే .

చీకటి భయం , చీకటి సుషుప్తి , చీకటి నిద్ర , చీకటి అజాగ్రత్త .
వెలుగు చైతన్యం , వెలుగు అభయం , వెలుగు జాగరూకత , వెలుగుకు దీపం ఆధారం . దీపం పరం జ్యోతి . దీపం సాక్షాత్తు లక్ష్మి . అందుకే ఒక దీపం కాదు , కోటి దీపాలు పెట్టి లోకం వెలుగుల దైవాన్ని కొలుస్తోంది .

-పమిడికాల్వ