chandrababu naidu,ysrcp,jagan,nirbhaya,ap

చక్రబంధంలో చంద్రబాబు

ఒక్క ఓట‌మి తెలుగుదేశం పార్టీని కుదేలు చేస్తోంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో రాజ‌కీయ శ‌త్రువుల అధికారంలో ఉండ‌టంతో చంద్ర‌బాబుకు ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ లేని క్లిష్ఠ ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటున్నారు. ఆయ‌న‌కు క‌ష్టాలు క్యూ క‌ట్టి మ‌రీ వ‌స్తున్నాయి. ఆయ‌న‌తో పాటు చుట్టూ ఉన్న వారికి కూడా కూడా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు మీడియాలో పెద్ద‌గా హైలెట్ కావ‌డం లేదు కానీ తెలుగుదేశం పార్టీ నేత‌లకు పెద్ద స‌మ‌స్య‌లను తీసుకువ‌చ్చేలా ఉన్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం ఆర్థిక మూలాల‌ను దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో టీడీపీ హ‌యాంలో కేటాయించిన కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేశారు. ఇలా ర‌ద్దైన కాంట్రాక్టులు ఎక్కువ‌గా తెలుగుదేశం పార్టీకి స‌న్నిహితంగా ఉండే కాంట్రాక్ట‌ర్ల‌వే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యమే.త‌ర్వాత అమ‌రావ‌తి ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఇందులో చాలా మంది టీడీపీ నేత‌ల పాత్ర ఉంద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. ఇప్ప‌టికే సీఐడీ ఈ వ్య‌వ‌హారంలో దూకుడు మీద ఉంది.తెల్ల రేష‌న్ కార్డుదారుల పేర్ల మీద భూములు కొన్న వారు ఎవ‌ర‌నే కూపీ లాగే ప‌నిలో ప‌డింది. ఇదే స‌మ‌యంలో మ‌రింత విచార‌ణ చేయాల‌ని ఐటీ, ఈడీని కూడా సీఐడీ కోరుతోంది. ఇప్ప‌టికే నారాయ‌ణ‌, ప‌త్తిపాటి పుల్లారావు వంటి తెలుగుదేశం ముఖ్యుల‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయి.ఇంకా ఎవ‌రెవ‌రు ఈ కేసులో ఇరుక్కుంటారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈడీ కూడా ఈ కేసులో జోక్యం చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేత‌ల ప్ర‌మేయం ఉందా లేదా అనేది త‌ర్వాత తేలినా ఇప్ప‌టికైతే ఆ పార్టీకి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు.ఇక‌, తాజాగా తెలుగుదేశం పార్టీ నేత‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ఐటీ దాడులు వారిని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. కేవ‌లం తెలుగుదేశం నేత‌లు, చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ స‌న్నిహితులే ల‌క్ష్యంగా నాలుగు రోజులుగా ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు వ‌ద్ద సుదీర్ఘ‌కాలం పీఎస్‌గా ప‌ని చేసిన శ్రీనివాస్‌, నారా లోకేష్ స‌న్నిహితులుగా ముద్ర‌ప‌డ్డ కిలారు రాజేష్‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు కుమారుడు శ‌ర‌త్‌, టీడీపీ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడు శ్రీనివాసులురెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల్లో పెద్ద ఎత్తున సోదాలు జ‌రుగుతున్నాయి.ఈ సోదాల వెనుక పెద్ద టార్గెట్ ఉంద‌ని, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి నిధులు త‌రిలాయ‌ని, ఇదంతా బ‌య‌ట‌కు లాగేందుకే ఈ ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఇప్ప‌టికి ఐటీ శాఖ ఈ దాడుల‌పై ఎటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌క‌పోయినా టీడీపీ నేత‌లు మాత్రం ఇబ్బందులు ఎదుర్కునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఐబీ చీఫ్‌గా చ‌క్రం తిప్పిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేయ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.ఇందుకు గానూ ఆయ‌న‌పై ప్ర‌భుత్వం తీవ్ర అభియోగాలు చేసింది. దేశ‌ద్రోహం కేసు నమోద‌య్యే అవ‌కాశం కూడా ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడైన అధికారిగా ముద్ర‌ప‌డ్డారు.ఇక‌, వివిధ జిల్లాల్లోనూ టీడీపీ నేత‌లు వ‌రుస‌గా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప‌త్తిపాటి పుల్లారావు వంటి వారు ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొడుతున్న దెబ్బ‌లకు అత‌లాకుత‌లం అవుతున్నారు. ఈ కేసులు, సోదాలు మీడియాలో పెద్ద‌గా చూపించ‌డం లేదు కానీ టీడీపీకి మాత్రం వ‌రుస క‌ష్టాలు చుట్టుముట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.