చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిని కొనసాగించాలి: పవన్ కల్యాణ్

ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ 112వ జయంతి
విజయవాడలోని పవన్ నివాసంలో కార్యక్రమం
ఆజాద్ కు నివాళులర్పించిన పవన్
భారత స్వాతంత్ర్య పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్ అందించిన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ 112వ జయంతి సందర్భంగా విజయవాడలోని పవన్ నివాసంలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసేన ఆజాద్ యువసేన విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి, చివరకు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆత్మబలిదానం చేసుకున్న గొప్ప యోధుడు ఆజాద్ అని అన్నారు. ఆజాద్ పేరులోనే స్వాతంత్ర్యం ఉందని, తన వీరత్వంతో అసంఖ్యాక భారతీయుల ప్రేమాభిమానాలకు పాత్రుడయ్యారని అన్నారు.