చంద్రబాబు నోట ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి‘ మాట!

  • బిట్రిష్ వారి గుండెల్లో ఉయ్యాలవాడ రైళ్లు పరిగెత్తించారు
  • ఆ విధంగా మోదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి
  • ప్రజలు అండగా ఉంటే కొండనైనా బద్దలు కొడతాం

  నాడు బిట్రిష్ వారి గుండెల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా అయితే రైళ్లు పరిగెత్తించారో, ఆ విధంగా మోదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. కర్నూలులో జరుగుతున్న ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ఐదు కోట్ల మంది అండగా ఉంటే కొండనైనా బద్దలు కొట్టే శక్తి టీడీపీకి ఉందని అన్నారు. నాడు జరిగిన గుజరాత్ అల్లర్ల సంఘటన.. ‘అన్యాయం’ అని అప్పుడే తాను మోదీకి చెప్పానని అన్నారు.

  రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని మరోసారి స్పష్టం చేశారు. మోదీ ఇచ్చే సర్టిఫికెట్ తమకు అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన జీవితాశయమని, దీనిని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా మారుస్తామని, కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఎన్డీఏకు బుద్ధి చెబుతామని చంద్రబాబు అన్నారు.

  Tags:syeraa narasimha reddy,krishna godavari,special status,britishers,tdp,chandra babu naidu