చంద్రబాబు తన అత్తగారి సొత్తంటూ పేదల భూములు లాగేస్తాడు జాగ్రత్త!: వైఎస్ జగన్

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే వెట్ ల్యాండ్ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూములను లాగేస్తాడని, ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు సహా ఇక ఏమీ మిగలనివ్వడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఏ పత్రిక చదవాలో, ఏ ఆస్పత్రికి వెళ్లాలో, అక్కడ ఎంత ఫీజు కట్టాలో, ఏ సినిమాలు చూడాలో, ఏం చేయాలో అన్నీ జన్మభూమి కమిటీలే చెబుతాయని సెటైర్లు విసిరారు.

రైతులకు పూర్తిగా సున్న వడ్డీ రుణాలు ఎగ్గొడతాడని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తాడని, పేదోడికి ఇల్లు ఇచ్చే విషయాన్ని మర్చిపోతాడని విమర్శించారు. చంద్రబాబు తనను వ్యతిరేకించేవారు సహా ఎవరినీ బతకనివ్వడని, సీబీఐ, ఈడీ లను రాష్ట్రంలోకి రానివ్వరని, చంద్రబాబు ఏ నేరాలు చేసినా పత్రికల్లో వార్తలుండవంటూ బాబుకు వత్తాసు పలికే ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు.