kanna lakshminarayana

గురజాల బయలుదేరిన కన్నా… మార్గమధ్యంలోనే అరెస్ట్ చేయనున్న పోలీసులు!

  • నేడు గురజాలలో బహిరంగ సభ
  • 144 సెక్షన్ అమలులో ఉందని గుర్తు చేసిన పోలీసులు
  • అయినా వినకుండా బయలుదేరిన కన్నా
  • దాచేపల్లి సమీపంలో అరెస్ట్ చేసే అవకాశం

నేడు గురజాలలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బయలుదేరుతున్న వేళ, ఈ ఉదయం హై డ్రామా జరిగింది. గుంటూరుకు వచ్చిన గురజాల సీఐ రామారావు, తమ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, పోలీస్ యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నామని కన్నాకు చెప్పారు. గురజాలకు బయలుదేరవద్దని చెబుతూ, నోటీసులను అందించారు. అయితే, వాటిని తీసుకునేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిరాకరించారు.

ఆ మరుక్షణమే, తాను గురజాలకు వెళుతున్నానని చెబుతూ, బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, గుంటూరు నుంచి గురజాల వరకూ రహదారులను దిగ్బంధం చేశారు. ఫిరంగిపురం, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట మార్గాల్లో ఆయన ఎటునుంచి గురజాలకు వెళ్లాలని ప్రయత్నించినా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా గురజాలకు 12 కిలోమీటర్ల దూరంలోని దాచేపల్లి వద్ద ఆయన్ను నిలువరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సభను విజయవంతం చేయాలని భావిస్తున్న బీజేపీ వర్గాలు పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Tags: Gurajala, Dachepalli, KannaArrest, Andhra Pradesh, BJP Police