గుడి కోసం లెక్కకు మించిన దానం… మూడు గంటల్లో రూ. 150 కోట్లు ఇచ్చిన భక్తులు!

ఉమియా మాత దేవాలయ నిర్మాణాన్ని తలపెట్టిన పటీదార్లు
విశ్వ ఉమియా ఫౌండేషన్ ఏర్పాటు
భారీగా విరాళాలు ఇచ్చిన పటీదార్ వర్గం
గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో నిర్మించతలపెట్టిన విశ్వ ఉమియాథామ్ మందిర నిర్మాణం కోసం మూడంటే మూడు గంటల్లో రూ. 150 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి. పటీదార్ సామాజిక వర్గానికి ఇలవేల్పుగా ఉన్న ఉమియా మాత మందిరాన్ని నిర్మించ తలపెట్టిన పటీదార్ నేతలు, విశ్వ ఉమియా ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను ప్రారంభించారు.

ఇక ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన పటీదార్ వర్గం వ్యాపారులు, ప్రజలు రూ. 150 కోట్లను ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. మొత్తం 40 ఎకరాల్లో ఉమియా మాత మందిరం నిర్మాణం కానుండగా, ఆలయ నిర్మాణ ఖర్చు రూ. 1000 కోట్లని అంచనా వేస్తున్నారు. 2024 నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఉమియా ఫౌండేషన్ భావిస్తోంది. కాగా, ముంబైకి చెందిన ఓ పటీదార్ వ్యాపారి ఏకంగా రూ. 51 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.