గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు

గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు

నియోజకవర్గ ప్రజలకు గులాబీ ముల్లు గుచ్చుకుంటున్నాయి. వారం రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గులాబీ దళపతి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరిచిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను గడగడపకు తీసుకెళ్లాలని సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, నియోజకవర్గం నేతల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇచ్చిన ఏఒక్క వాగ్దానాన్ని పూర్తిస్థాయలో అమలుపరిచిన దాఖలాలు లేకపోవడంతో ప్రచారంలో ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు జత కట్టి మహాకూటమి అభ్యర్థి గుండా మల్లేష్‌ను మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దింపాయి.

బీఎస్పీ అభ్యర్థిగా మాజీ మంత్రి, కాకా తనయుడు గడ్డం వినోద్ కూడా బరిలోకిదిగి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాడు. బీజేపీ అభ్యర్థి కొయ్యల హేమాజీ గ్రామాల్లో పర్యటిస్తూ కేంద్రం పథకాలను వివరిస్తూ ప్రచారానికి పదునుపెడుతున్నారు. సొంత గులాబీ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం కార్యకర్తలను పట్టించుకోకపోవడం సొంత పార్టీకి ఈ ఎన్నికల్లో పెనుశాపమైంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఒక వర్గం నాయకులు గడ్డం వినోద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రచారంతో టీఆర్‌ఎస్ ఓటమి ప్రణాళికలు రచిస్తుండటం గులాబీ పార్టీకి గొడ్డలిపెట్టుగా మారింది. ఈ నేపథ్యంలో నేడు బెల్లంపల్లిలో జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ సవాల్‌గా మారనుంది.