గాంధీ అసత్యాలు చెప్పరు, మోదీ సత్యాలు చెప్పరు: సీఎం చంద్రబాబు

గాంధీ అసత్యాలు చెప్పరు, మోదీ సత్యాలు చెప్పరు: సీఎం చంద్రబాబు

గాంధీ పుట్టిన రాష్ట్రంలోనే మోదీ కూడా పుట్టారు
గాంధీజీది అహింసావాదం, మోదీది హింసావాదం
తన తల్లిని కూడా పట్టించుకోని వ్యక్తి మోదీ
మోదీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకూ వదిలిపెట్టనని ఏపీ చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానమని, నాటి గోద్రా అల్లర్లలో రెండు వేల మంది మృతికి కారకుడు మోదీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు.

నిన్న రాజమహేంద్రవరం వచ్చిన మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలోనే మోదీ కూడా పుట్టారని, గాంధీ అసత్యాలు చెప్పరు, మోదీ సత్యాలు చెప్పరని, గాంధీజీది అహింసావాదం, మోదీది హింసావాదం అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తన తల్లిని కూడా పట్టించుకోని వ్యక్తి మోదీ అనీ, ఇలాంటి వారు ఉంటారనే వృద్ధులకు పింఛన్ ఇస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.