గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ అయిపోరు: ‘ఉత్తమ్’పై కేటీఆర్ సెటైర్

గడ్డం తీసుకోకపోతే ఉత్తమ్ సన్నాసుల్లో కలిసిపోతారు
చంద్రబాబు వద్ద మోకరిల్లేవారితో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందా?
55 ఏళ్లు పాలించిన గాంధీల వల్లే తెలంగాణ ఇలా అయింది
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ అయిపోరంటూ ఎద్దేవా చేశారు. ఉత్తమ్ గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని… 60 ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలో పోతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎందుకు గద్దె దింపాలి? రైతులకు రుణ మాఫీ చేసినందుకా? రైతుబంధు ద్వారా పెట్టుబడులు ఇచ్చినందుకా? గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

విజయవాడకు వెళ్లి చంద్రబాబు కాళ్ల వద్ద మోకరిల్లే వారితో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందా? లేక ప్రజలతో ఉండే టీఆర్ఎస్ తో సాధ్యమవుతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 55 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గాంధీల వల్లే తెలంగాణ ఇలా ఉందని… షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలాంటి కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్ పై విమర్శలు మానుకోవాలని సూచించారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే విడతలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని… మరి కర్ణాటకలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ ఎందుకు చేస్తోందో ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశం ఆశ్చర్యపోయే విధంగా టీఆర్ఎస్ కు భారీ ఎత్తున ఓట్లు వేసి, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.