కోటీశ్వరుల కొట్లాట

నాలుగురోజుల కిందట హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఒక కొట్లాట వార్త ఎవరి దృష్టినీ ఆకర్షించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది . ఆ బాధను మీతో పంచుకోవడానికే ఈ నాలుగు మాటలు . కలవారి కులం వేరు . వారి అభిరుచులు వేరు . వారి వేషభాషలు వేరు . వారు వాడే వాహనాలు వేరు . ప్రపంచంలో అతికొద్దిమందికి మాత్రమే దొరికే స్పెషల్ ఎడిషన్ కార్లను వాడతారు . అవి కొనడానికి కోట్లు , దిగుమతి చేసుకోవడానికి 125 శాతం అదనపు సుంకం . అంటే మన భాషలో కోటి రూపాయల కారు 2 కోట్ల 25 లక్షల రూపాయలు అవుతుంది . అలా ఇద్దరు కన్నుమిన్ను కానని సంపన్నులు అతి విలాసవంతమయిన కార్లు కొన్నారు . ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఇద్దరి మధ్య పోటీ పెరిగింది . లక్షల్లో బిడ్లు పెంచుకుంటూ పోయారు . ఒకరిని మించి ఒకరు . మిగిలిన ఒకమోస్తరు సంపన్నులు స్పృహదప్పి పోటినుండీ ఎప్పుడో తప్పుకున్నారు .

ఇద్దరికీ 1111 – ఆల్ వన్స్ కావాలి . కానీ ఒకరికే దొరుకుతుంది . నాకు కావాలి నువ్ తప్పుకో అని ఒక బలుపు చక్రవర్తి అంటే – సేమ్ నాదీ అదే డైలాగ్ అని ఇంకో బలిసిన ఆసామి అన్నాడు . మాటా మాటా పెరిగింది . తెలుగు , ఇంగ్లీషు , హిందీ భాషల్లో ఉన్న బూతులన్నీ పరస్పరం వాడేశాక విధిలేని పరిస్థితుల్లో ఒకరినొకరు కొట్టుకున్నారు . ముక్కులు పగిలాయి , పళ్లు రాలాయి , రక్తాలు కారాయి . అయినా పట్టువిడవని వారి పోరాటమపటిమను , యుద్ధ విద్యలను చూసి చెమర్చిన కళ్లతో అభినందనపూర్వకంగా అయిష్టంగా దారినపోయేవారు వారిని ఆసుపత్రిలో చేర్చి పాపం మూటగట్టుకున్నారు .వారి సంపద , వారి గర్వం , వారి అహంకారం , వారి ముక్కులు , వారి రక్తం . మనకు ఏ రకంగానూ నష్టం లేదు , అభ్యంతరం ఉండడానికి వీలులేదు .

కర్ర ఉన్నవాడిదే గొర్రె . ఆర్ టీ ఏ ఆఫీసుల్లో ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా ఎంత సేపయినా చావగొట్టుకోవడానికి వీలుగా ఎయిర్ కండిషన్ గోదా సంపన్నులకు ప్రత్యేకంగా ఏర్పాటు లేకపోవడం నిజంగా ఒక వెలితి . అయిదారు కోట్ల కారే కొన్నప్పుడు 30 , 40 లక్షలు నంబరు కోసం పెట్టడం న్యాయం , నవీన ధర్మం . ఇద్దరు ధనవంతులు ఫ్యాన్సీ నంబరుకోసం ఎంతయినా డబ్బు కట్టడానికి సిద్ధమయినప్పుడు – ఒకరితో ఒకరు భౌతికంగా తలపడి ఎవరు చావుదప్పి కన్నులొట్టబోయి బతికి బట్టకడితే వారినే దిక్కుమాలిన ఫ్యాన్సీ నంబరు వరిస్తుందని రవాణా శాఖ బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది .

అసలు ఫ్యాన్సీ నంబర్లను వేలంలో అమ్ముకుని పేదలను , మధ్యతరగతిని రవాణా శాఖ ఎప్పుడో అంటరానివారిగా పక్కకు పెట్టింది . అలాంటప్పుడు వాటికోసం ముచ్చటపడి ప్రాణాలయినా ఇవ్వడానికి సిద్ధపడే సంపన్నుల కోరికనయినా రవాణా శాఖ పెద్దమనసుతో అంగీకరించాలి . దానివల్ల వస్తే ఫ్యాన్సీ నంబరు – పొతే ప్రాణం అన్న క్లారిటీ అయినా వస్తుంది . వేలంలో ఎవరు ఎక్కువపాడితే వారికే ఫ్యాన్సీ నంబరు అన్నప్పుడే – ఈ తతంగమంతా యుద్ధ విద్యల్లో చేరిపోయింది .అలాంటప్పుడు యుద్ధాలే జరగాలి . నంబర్ల కోసం యుద్ధాల్లోనే గెలవాలి .

నంబరు శరణం గచ్చామి
యుద్ధం శరణం గచ్చామి

శుభోదయం