కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ప్రముఖ కమెడియన్ అలీ

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాడు ప్రముఖ కమెడియన్ అలీ. పది రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల అధినేతలతో భేటీ అయిన ఆయన ఆంధ్ర్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశించాడాయన. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాస్తవ్యుడైన అలీ.. అక్కడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డాడు. అయితే, ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీ.. భారతీయ జనతా పార్టీకి కేటాయించింది. అక్కడ కుదరకపోయేసరికి గుంటూరు తూర్పు నుంచైనా పోటీ చేయాలని భావించాడు. ఇక్కడ ముస్లిం ఓటర్లు భారీగా ఉండడంతో అలీకే టికెట్ దక్కుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఆ టికెట్ మద్దాలి గిరిధరరావుకు కేటాయించారు టీడీపీ అధినేత. దీంతో ఆ ఎన్నికల్లో అలీకి పోటీ చేయడం కుదరలేదు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారైనా పోటీ చేయాలనే ఆలోచనతో అందరికంటే ముందు తన స్నేహితుడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో అలీ రహస్యంగా భేటీ అయ్యాడట.

ఈ సందర్భంగా అలీ తన కోరికను ఆయన ముందుంచితే పవన్ షాక్ ఇచ్చాడని తెలిసింది.సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితుడైన అలీ కోరికను పవన్ తిరస్కరించడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో అలీ ఆశించిన రెండు స్థానాల్లో ఒకటైన రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నారు. భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినా.. ఆమె జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో పవన్ ఫిదా అయిపోయారట. అందుకే ఆమెకు సిటీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారని టాక్. దీనికి తోడు ఆకుల కూడా త్వరలోనే జనసేనలోకి వచ్చేస్తానని పవన్‌తోనే స్వయంగా చెప్పారని తెలిసింది. ఇక మరో నియోజకవర్గం గుంటూరు తూర్పు విషయానికొస్తే.. ఆ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన నాదెండ్ల మనోహర్.. జనసేనలో చేరిన తర్వాత ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిపోయారు. ఇక గుంటూరు జిల్లాలోని టికెట్ల విషయం పవన్ పూర్తిగా ఆయనకే అప్పగించాడని సమాచారం. అందుకే ఈ టికెట్ కూడా హామీ ఇవ్వలేనని జనసేనాని అలీతో అన్నారట. పవన్ సమాధానంతో తీవ్ర నిరాశ చెందిన అలీ.. వెంటనే వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కలిశాడనే టాక్ వినిపిస్తోంది. అలీ వైసీపీలో చేరుతాడని ప్రచారం జరిగినా క్లారిటీ మాత్రం రాలేదు.
Source: namastheandhra