కేసీఆర్‌ మావద్ద కూలీగా పనిచేశాడు : గులాంనబీ

కేసీఆర్‌ మావద్ద కూలీగా పనిచేశాడు : గులాంనబీ

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్‌ పుణ్యానికి సీఎం అయ్యారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. గజ్వేల్‌ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డికి మద్దతుగా మంగళవారం ప్రజ్ఞాపూర్‌ నుంచి గజ్వేల్‌ వరకు జరిగిన రోడ్‌షోలో ఆజాద్‌తో పాటు సినీ నటి నగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తాను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో కేసీఆర్‌ తన వద్ద కూలీ మనిషిలా పనిచేశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.