కేరళలో బీజేపీ ఇప్పట్లో అధికారంలోకి రాదు.. సొంత పార్టీకి షాకిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే!

కేరళలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సొంత నేత ఒకరు షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు.. సమీప భవిష్యత్ లోనూ బీజేపీ కేరళలో అధికారంలోకి రాబోదని తేల్చిచెప్పారు. కేరళ అసెంబ్లీలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న ఓ రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేరళలో నిరుద్యోగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ..‘కేరళను బీజేపీ పాలించడం లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ అధికారంలో లేదు. సమీప భవష్యత్తులో కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

మన రాష్ట్రంలో జాతీయ సగటు కంటే నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఉపాధి కోసం యువతీయువకులు వలస వెళుతున్నారు. ఇది వాస్తవం’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై మీడియా కేరళ బీజేపీ చీఫ్ శ్రీధరణ్ పిళ్లైను సంప్రదించగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తప్పించుకున్నారు. 2015 గణాంకాల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత 5 శాతం కాగా, కేరళలో 12 శాతంగా నమోదయింది.