కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ముందున్న అవకాశాలు ఇవే!

  • సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష
  • బలపరీక్షలో నెగ్గుతామన్న యడ్యూరప్ప
  • యడ్డీ ఓటమి ఖాయమన్న జేడీఎస్, కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈ సందర్భంగా సభను నడిపేందుకు ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత బోపయ్యను నియమించారు. మరోవైపు బలపరీక్షలో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మాట్లాడుతూ, బలపరీక్షలో నెగ్గుతామని, సాయంత్రం సంబరాలు చేసుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, ఫ్లోర్ టెస్ట్ లో యడ్యూరప్ప ఓడిపోవడం ఖాయమని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ముందున్న అవకాశాలను రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణల ప్రకారం బీజేపీ ముందున్న అవకాశాలు ఇవే…

  • మ్యాజిక్ ఫిగర్ ను సాధించేందుకు అవసరమైనంతమంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడం.
  • విపక్షాలకు చెందిన 14 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు సభకు హజరుకాకపోవడం.
  • బీజేపీ ఓటమి తప్పదు అని స్పష్టమైన తరుణంలో… సభలో గందరగోళం సృష్టించి, సభను వాయిదా వేయించడం.
  • గెలవలేమని తేలినపక్షంలో యడ్యూరప్ప రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లడం.