ఓటుకు పదివేలు ఇవ్వమని చంద్రబాబు డబ్బిస్తే... కాజేసి, 500 ఇస్తున్న తెలుగుతమ్ముళ్లు: విజయసాయి రెడ్డి!

ఓటుకు పదివేలు ఇవ్వమని చంద్రబాబు డబ్బిస్తే… కాజేసి, 500 ఇస్తున్న తెలుగుతమ్ముళ్లు: విజయసాయి రెడ్డి!

అడిగితే ఈసీ పట్టుకుందని స్టోరీలు అల్లుతున్నారు
పరాజయం తప్పదని చంద్రబాబుకు అర్థమైంది
అందుకే ఈవీఎంలను ప్రశ్నిస్తున్నారన్న విజయసాయి
ఒక్కో ఓటును కొనుగోలు చేసేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని చంద్రబాబు డబ్బులు ఇస్తే, మధ్యలో ఉన్న తెలుగు తమ్ముళ్లు కాజేసి గ్రామాల్లో రూ. 500, రూ. 1000 మాత్రమే పంచుతున్నారని, అడిగితే, ఈసీ పట్టుకుందని స్టోరీలు అల్లుతున్నారన్న విషయం తనకు తెలిసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ఓటుకు పదివేలివ్వమని చంద్రబాబు డబ్బు పంపిస్తే మధ్యలో ఉన్నవారు మింగేసి 500,1000 ఇస్తున్నారని గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. ఎలక్షన్ అధికారులు డబ్బుమూటల్ని పట్టుకుంటే పారిపోయి వచ్చామని ఇదే అదనుగా స్టోరీలు అల్లుతున్నారట తమ్ముళ్లు. ఏపీని ఇలా చేసావేంటి చంద్రబాబు?” అని అన్నారు. ఆపై “ఏమైంది చంద్రబాబూ? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పట్టించుకోవద్దా? మీది పోస్టాఫీసు కాదుగదా అని హెచ్చరిస్తావా? సిఇసి పని చెబ్తావా?ఆ బెదిరింపులేమిటీ, నిలదీయటాల్లేంటి. దేశంలో ఏ సిఎం అయినా ఇలా మాట్లాడటం ఎప్పుడైనా జరిగిందా?” అని ప్రశ్నించారు.

అంతకుముందు “అవమానకర పరాజయం తప్పదని అర్థమవడంతో చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నాడు. ఇవిఎంల సాంకేతికను ప్రశ్నిస్తున్నాడు. సిఇఓ ద్వివేది ఆఫీసు ముందు ధర్నాకు దిగాడు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి కామెడీ పండించాడు. ఇంకెన్ని ‘కథకళి’లుంటాయో పోలింగ్ ముగిసే వరకు” అని సెటైర్లు వేశారు.