ఏప్రిల్ - మార్చి కాదు... ఇక ఆర్థిక సంవత్సరం అంటే జనవరి - డిసెంబర్!

ఏప్రిల్ – మార్చి కాదు… ఇక ఆర్థిక సంవత్సరం అంటే జనవరి – డిసెంబర్!

నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం అంటే, ఇప్పటివరకూ అమలవుతున్న ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకూ కాకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై గతంలోనే వార్తలు రాగా, వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత సంవత్సరం ఉంటే బాగుంటుందని, బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన సంప్రదాయాలు పోవాలన్న కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, గతంలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్న వేళ, నరేంద్ర మోదీ ఆర్థిక సంవత్సర కాలాన్ని మార్చే అంశం పరిశీలిస్తున్నామని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న కేంద్రం, ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో బడ్జెట్ ఫిబ్రవరి నెలలో ఆఖరి పనిదినాన పార్లమెంట్ ముందుకు వస్తుండగా, దాన్ని ఫిబ్రవరి 1కి మార్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకూ పరిగణనలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్ డిసెంబర్ ఆఖరివారంలోపు పార్లమెంట్ ముందుకు వస్తుంది.