ఏప్రిల్‌ 15న ప్రపంచకప్‌ జట్టు ప్రకటన

 

 

 

 

 

ముంబయి : ఇంగ్లాండ్‌లో మే 30నుంచి జరగబోయే 2019 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఏప్రిల్‌ 15న జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 23 వరకూ ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన గమనించి వాళ్ల బ్యాటింగ్‌ స్థానాలు నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇప్పటికీ నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌, నాలుగో పేస్‌ బౌలర్‌ స్థానాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ఆ మిగిలిన ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

ప్రపంచకప్‌ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐకి ఏప్రిల్‌ 23 వరకు అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు ఎంపిక సులభతరం చేసేందుకు ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం అంబాటి రాయుడు, రిషభ్‌ పంత్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అయితే రాయుడు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మరోవైపు పంత్‌ బ్యాట్‌తో రాణించి అందరినీ ఆకట్టుకున్నా మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం పంత్‌కు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు విజయ్‌శంకర్‌ కూడా పోటీలో ఉన్నాడు. అయితే భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సంప్రదించిన తర్వాతే జట్టు ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు.