ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..

 

బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్‌ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్‌వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో ఆయనకు స్వాగతం పలికారు. ఐఆర్‌పీఎస్ (1986) బ్యాచ్ అధికారి అయిన రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలో పనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం  నియమించిన సంగతి తెలిసిందే.