ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు... సన్నాహాలు మొదలు!

ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు… సన్నాహాలు మొదలు!

తాను అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని, జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

ఇక కొత్తగా రానున్న జిల్లాలను పరిశీలిస్తే, అరకు (విశాఖ జిల్లా), అనకాపల్లి (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా).

ఇదే సమయంలో అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా ఉంటుందని సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఇప్పుడప్పుడే వెలువడే పరిస్థితి లేనప్పటికీ, ఫైళ్లు చకచకా కదులుతున్నాయని తెలుస్తోంది.