ఏపీమండలి రద్దు తీర్మానంపై సంకట స్థితిలో బీజేపీ

మండలి రద్దు తీర్మానంపై సంకట స్థితిలో బీజేపీ

మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్నిఏపీ సర్కార్ కేంద్రానికి పంపింది  . దీనికి కేంద్రం నుండి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రాల స్థాయిలో ఇలాంటి చట్ట సభల ఏర్పాటుకు, రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర తప్పనిసరి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయానికి కేంద్రంలో ఆమోదం లభిస్తుందా ? ఒకవేళ లభిస్తే ఎప్పటికి ఆమోదం లభిస్తుంది అన్నది ఒక చర్చ అయితే , ఒకవేళ ఆమోదిస్తే తరువాత పరిణామాలు ఏంటి ? ఆమోదించకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఏపీలో ఆసక్తికర అంశంగా మారింది.ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి ఇప్పుడు కేంద్రానికి పంపింది. నేటి నుండి కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు అంశం, మూడు రాజధానుల వ్యవహారాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని టీడీపీ భావిస్తుంది. ఎలాగైనా వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని భావిస్తుంది. ఇక అలా కాకుండా వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి మండలి రద్దు చేస్తే అది కేంద్రంలోని బీజేపీకి మరో తలనొప్పి తెచ్చి పెట్టే ప్రమాదం కనిపిస్తుంది. దీంతో కేంద్రం మెడకు మండలి రద్దు ఉచ్చు చిక్కుకుంది.
మండలి రద్దుపై ఏ నిర్ణయం తీసుకున్నా చిక్కే పార్లమెంట్ లో మండలి రద్దు బిల్లు ఆమోదం పొందితే మాత్రం బీజేపీ ఇరుక్కుపోవడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటె ఆంధ్రప్రదేశ్ లో మండలిని రద్దు చేస్తే బీజేపీని మండలి రద్దుకు మరికొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది . ముఖ్యంగా బీజేపీ అధికారం కోల్పోయిన రాష్ట్రాలలో మండలిలో బీజేపీ బలం ఉన్న చోట మండలి రద్దుకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఇక అంతే కాకుండా మధ్యప్రదేశ్, పంజాబ్ , పశ్చిమబెంగాల్ , అసోం లు కూడా మండలి పునరుద్ధరణ కోరుతూ తీర్మానామ్లు చేసి పంపాయి. వాటిని కూడా ఆమోదించాల్సి వస్తుంది .

ఇలా రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మండలిని రద్దు చేసే, లేదా పునరుద్ధరించాలని డిమాండ్ చేసే అవకాశం మెండుగా ఉన్న తరుణంలో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ స్టెప్ తీసుకున్నా అది బీజేపీకి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు అంశానికి ప్రాధాన్యత ఇస్తుందా? లేదా ?ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే అంశం .