ఏడు కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ‘జనసేన’

‘జ‌న‌సేన’ క‌మిటీల‌ను పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. ఏడు క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను ఈరోజు ప్ర‌క‌టించ‌గా, మిగిలిన క‌మిటీల స‌భ్యుల వివ‌రాల‌ను ఆయా క‌మిటీల చైర్మ‌న్ల‌తో మాట్లాడిన అనంత‌రం ప్ర‌క‌టిస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెల్ల‌డించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా త‌మిళ‌నాడు మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ పి.రామ్మోహ‌న్‌రావు(ఐఏఎస్‌)ను నియ‌మించారు. స్టేట్ క‌మిటీ ఫ‌ర్ మైనారిటీస్ చైర్మ‌న్‌గా విద్యావేత్త అర్హం ఖాన్‌ను, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ క‌మిటీ చైర్మ‌న్‌గా ద‌ళిత ఉద్య‌మ‌నేత అప్పిక‌ట్ల భ‌ర‌త్‌భూష‌ణ్‌ను ఎంపిక చేశారు.

రాష్ట్ర మ‌హిళా సాధికారిత క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా క‌ర్నూలుకు చెందిన రేఖాగౌడ్‌ నియమితులయ్యారు. ప్ర‌స్తుతం జనసేన పార్టీ వీర మ‌హిళా విభాగం చైర్మ‌న్‌గా ఉన్న ఆమెను ఆ బాధ్య‌త‌ల నుంచి మార్పు చేశారు. పార్టీ రాష్ట్ర నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌ (ఐఏఎస్‌)ను నియ‌మించారు. రాష్ట్ర ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన‌ పార్టీ ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ (రాజోలు) పేరును ఖ‌రారు చేశారు.

గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ రాష్ట్ర చైర్మ‌న్‌గా చింత‌ల పార్ధ‌సార‌థిని ఎంపిక‌ చేశారు. రాష్ట్ర లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీలో స‌భ్యులను కూడా నియమించారు.
Tags: janasena comittee, party chairman,rekha goud