ఏకాగ్రతను దెబ్బతీసి గెలిచిన మారిన్: బాధగా ఉందన్న పీవీ సింధు

సిద్ధం కాకముందే మారిన్ సర్వీస్ లు
తొలి గేమ్ లో చేసిన రెండు మూడు తప్పులే కొంపముంచాయి
వచ్చే సంవత్సరం స్వర్ణం సాధిస్తానన్న తెలుగుతేజం
షటిల్ కోర్టుపై చాలా వేగంగా కదులుతూ ఉండే కరోలినా మారిన్ చేతిలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో ఓడిపోయిన తెలుగుతేజం పీవీ సింధూ, ఈ ఓటమి తనకెంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రపంచ టాప్ క్రీడాకారిణులతో పోటీపడి పతకం గెలవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఫైనల్ పోరులో తనను మానసికంగా దెబ్బకొట్టేందుకు మారిన్ పన్నిన వ్యూహం ముందు తాను తలొగ్గడమే ఓటమికి కారణమైందని సింధూ వ్యాఖ్యానించింది. తాను సిద్ధం కాకుండానే మారిన్ సర్వీస్ లు చేసిందని, దానివల్ల తన ఏకాగ్రత దెబ్బతిందని చెప్పింది.

కొన్ని పొరపాట్లు కూడా తనవైపు నుంచి జరిగాయని, తొలి గేమ్ లో ఆధిక్యంలో ఉండి కూడా ఓడిపోవడం మ్యాచ్ ని దూరం చేసిందని చెప్పింది. రెండు మూడు పాయింట్లు మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయని, తొలి గేమ్ ఓడిపోయిన తరువాత తనకిక కోలుకునే అవకాశమే లభించలేదని చెప్పింది. ఇటీవలి రెండు మూడు టోర్నీలలో తాను ఓడిపోయినా, బాధపడలేదని, ఈ మ్యాచ్ ఓటమిని మాత్రం అంత త్వరగా మరువలేనని చెప్పింది. గత సంవత్సరం తనకు కాంస్య పతకాలు ఎక్కువగా వచ్చాయని, ఈ సంవత్సరం రజత పతకాలు వస్తున్నాయని, వచ్చే సంవత్సరమైనా ‘స్వర్ణ పతకం సాధించిన సింధూ’ అనిపించుకుంటానని వ్యాఖ్యానించింది.