ఎస్‌బీఐ నగదు పెట్టెకు కన్నం రూ.39 లక్షల అపహరణ

అనంతపురంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన ఓ శాఖలో శనివారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. నగదు భద్రం చేసిన పెట్టెకు కన్నం వేసి రూ.39 లక్షలు అపహరించారు. అనంతపురం శివారులోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ముఖద్వారం పక్కనే ఎస్‌బీఐ బ్రాంచి ఉంది. బ్యాంకు వెనుక వైపు రాత్రివేళల్లో జనసంచారం ఉండదు. పరిసరాలను గమనించిన ముఠా.. చోరీకి అనువైన ప్రాంతంగా పసిగట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక దొంగలు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వెనుక భాగంలో కిటికీ గ్రిల్‌ను కత్తిరించి లోపలికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌, కట్టర్ల సాయంతో తాళాలను తొలగించి, నేరుగా నగదు భద్రపరచిన గదిలోకి ప్రవేశించారు. ఓ గదిలో నగదు ఇనుప పెట్టెలో ఉండగా… పక్కనే మరో రెండు పెట్టెలలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. దొంగలు ఇనుప పెట్టెకు గ్యాస్‌ కట్టర్లతో రంధ్రం వేశారు. ఇందులో నగదు రూ.41లక్షలు ఉండగా రూ.39,18,541 అపహరించారు. పక్క పెట్టెలు తెరిచేందుకు సమయం సరిపోక వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటలకు బ్యాంకు సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. చోరీ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్పీ అశోక్‌కుమార్‌, నగర డీఎస్పీ వెంకట్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరులు రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. సుమారు పదింటి తీగలను కత్తిరించారు. అయితే బ్యాంకు లోపలికి ప్రవేశించేదాకా సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు నిక్షిప్తమయ్యాయి. సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించినట్లు నిర్ధారణకు వచ్చారు. చోరులు బ్యాంకు ఆవరణలోకి రాగానే అలారం తీగలను తొలగించి.. సైరన్‌ మోగకుండా జాగ్రత్త తీసుకొన్నారు. బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ సీతారామశర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.