ఎన్ని జీవితాలు చూశానో..?!

నటీనటులకు ఓ సౌలభ్యం ఉంది. తాము పోషించే పాత్రల వల్ల… కొత్త జీవితాలు, కొత్త వ్యక్తిత్వాలు పరిచయం అవుతుంటాయి. వాటి ద్వారా తమ దైనందిన జీవన విధానం మార్చుకునే వీలు దక్కుతుంటుంది. సమాజాన్ని చదివే అవకాశం వస్తుంది. కాజల్‌ కూడా ఇదే మాట అంటోంది. ‘‘నేను ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినో అయితే.. నా గురించీ, మహా అయితే నా చుట్టు పక్కల వ్యక్తుల గురించి మాత్రమే తెలిసేది. నటిని కావడం వల్ల ఎన్నో జీవితాల్ని అనుభవించే అవకాశం దక్కుతోంది. అల్లరి పిల్లగా, బాధ్యత గల యువతిగా, గృహిణిగా, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఇలా రకరకాల పాత్రలు చేస్తుంటాను. ఆ పాత్రల గురించి కాస్తో కూస్తో అధ్యయనం చేసే అవకాశం నాకుంది. వివిధ సందర్భాల్లో, వివిధ మనస్తత్వాలు గల అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోగలుగుతున్నాను. దాంతో నా ఆలోచనా దృక్పథంలోనూ మార్పులు వస్తుంటాయి’’ అంటోంది కాజల్‌.