‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కైకాల సత్యనారాయణ

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్
హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల
లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల
తెలుగు తెరపై ఎస్వీ రంగారావు తరువాత ఆ స్థాయిలో నవరసాలను పలికించిన నటుడిగా కైకాల సత్యనారాయణ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. వందలాది చిత్రాలతో .. విభిన్నమైన పాత్రలతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి కైకాల సత్యనారాయణ .. ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శక నిర్మాత హెచ్ ఎమ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నారు.

సత్యనారాయణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని హెచ్ ఎమ్ రెడ్డిగా కనిపిస్తోన్న ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీమ్ కైకాల సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. 1930ల్లో వచ్చిన ‘కాళిదాస్’ .. ‘భక్త ప్రహ్లాద’ .. ‘గృహలక్ష్మి’ చిత్రాలు దర్శకుడిగా హెచ్ ఎమ్ రెడ్డి ప్రతిభాపాటవాలను ఆవిష్కరిస్తాయి. అలాంటి ఆయన పాత్రలో కైకాల సత్యనారాయణ ఒదిగిపోయినట్టుగా తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.