ఈ నెల 26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె

ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా కన్సాలిడేట్‌ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు బ్యాంకు అధికారుల సంఘాలు తెలిపాయి.ఈ మేరకు బ్యాంకు అధికారుల సంఘాలు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ కు ఉమ్మడిగా నోటీసు పంపాయి. అటు బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలను తక్షణం పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, నగదు లావాదేవీల వ్యవధిని తగ్గించాలని, నియంత్రిత పని గంటలు అమలు పరచాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి. బ్యాంకుల విలీనం ప్రక్రియను నిరసిస్తూ ఈ నెల 20న పారమెంటు భవనం ఎదుట ధర్నా చేయనున్నట్టు బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక ప్రకటించింది. ధర్నా అనంతరం ఆర్థికమంత్రికి తాము వినతిపత్రం సమర్పిస్తామని తెలిపింది. ఆంధ్రాబ్యాంకు సహా దేశంలోని 10 పెద్ద బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు ప్రభుత్వం గత నెల 30న ప్రకటించింది.

Leave a Reply